డంప్‌యార్డు నుంచి వెలువడుతున్న పొగ
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్‌యార్డులో మళ్లీ అగ్గి రాజుకుంది. రెండు రోజులుగా వీస్తున్నగాలి దుమారంతో మంటలు డంప్‌యార్డు మొత్తం విస్తరించాయి. గురువారం డంప్‌యార్డు మొత్తం మంటలు లేవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికితోడు డంప్‌యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మానేరు ఒడ్డున ఉన్న డంప్‌యార్డు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పెద్దపల్లి బైపాస్‌పై వెళ్లే ప్రయాణికులకు రోడ్డు కనబడని పడని విధంగా పొగ కమ్మేసింది. గత ఏప్రిల్ నెలలో కూడా డంప్‌యార్డులో మంటలు అంటుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం స్పందించి చల్లార్చేందుకు చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం రెండు రోజుల అక్కడే ఉండి కార్మికులు, ఫైరింజన్లు, మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో డంప్‌యార్డులో మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకచోట వాటర్ కొడితే మరో చోట మంటలు లేస్తున్నాయి. వేడి గాలులు వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది.
ఒకే డంప్‌యార్డుతో సమస్యలు...
కరీంనగర్ నగరపాలక సంస్థలో 78 వేల కుంటుంబాలు, 3.5 లక్షల జనాబా ఉంది. ప్రతిరోజూ 180 టన్నులు చెత్త వెలువడుతోంది. గత యాబై ఏళ్లుగా బైపాస్‌రోడ్డులోని మానేరు వాగు ఒడ్డున ఉన్న 9 ఎకరాల స్థలంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారు. రోజు రోజుకూ నగరం విస్తరిస్తుండడం, జనాబా పెరుగుతుండడంతో చెత్త వేయడం సమస్యగా మారింది. చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో చిన్నగా మంటలు అంటుకున్నా త్వరగానే డంప్‌యార్డు మొత్తం విస్తరిస్తోంది. ఐదేళ్లుగా ఇతర ప్రాంతాల్లో డంప్‌యార్డు ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా ఫలించ లేదు. ఉన్న ఒక్క డంప్‌యార్డులోనే చెత్తను వేస్తున్నారు.
తడి, పొడి వేరుచేయకుండానే....
తడి, పొడి చెత్తను వేరు చేస్తే డంప్‌యార్డుకు చెత్తను తగ్గించవచ్చు. అయితే నగరంలో వెలువడుతున్న చెత్తను తడి, పొడి వేరుచేయకుండానే డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు కోసం సర్వే సమయంలో చెత్తను వేరు చేస్తున్నట్లు హాడావుడి చేయడం ఆ తర్వాత అటకెక్కించడం నగరపాలక సంస్థలో రివాజుగా మారింది. చెత్త మొత్తం ట్రాక్టర్లతో డంప్‌యార్డుకు తరలిస్తుండడంతో డంప్‌యార్డు గుట్టగా పేరుకు పోయి చెత్త డంపింగ్ చేసేందుకు స్థలం కరువవుతోంది.
ప్లాస్టిక్ వ్యర్థాలతో మరింత సమస్య...
నగరపాలక సంస్థలో వెలువడే చెత్తలో 50 శాతంపైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీంతో చెత్త త్వరగా అంటుకుని మంటలు విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ మండడం వల్ల విషవాయువులు వెలువడి, ప్రజలు అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు కాలం చెల్లిన మందులు, ఆసుపత్రి వ్యర్థాలను సైతం చెత్తలోనే డంప్ చేస్తుండడంతో డంప్‌యార్డు వ్యర్థాలతో విషపూరితంగా మారుతోంది. డంప్‌యార్డు అంటుకున్న సమయంలో అందులో ఉన్న ఆసుపత్రి వ్యర్థాలు, ఇతర విషపూరిత రసాయనాలతో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ, చర్మవ్యాధులకు గురయ్యేప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment