
చెత్తకుప్పలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ధ్వంసం చేయించడమే కాకుండా దానిని చెత్తలారీలో డంపింగ్‌యార్డ్‌కు తరలించారు. మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుండగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాలు... శనివారం తెల్లవారుజామున కొందరు దళిత సంఘాల నేతలు పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్ధలంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ అధికారులు పోలీసుల సహాయంతో దానిని తొలగించారు. చెత్తలారీలో విగ్రహాన్ని జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న దళితబహుజన సంఘాల నాయకులు లారీని అడ్డుకుని అందులో ఉన్న చెత్తను కింద పోయించారు. చెత్తతోపాటు ధ్వంసమైన అంబేడ్కర్ విగ్రహం కనిపించింది. దీంతో మాలమహానాడు రాష్ట్ర నాయకుడు పసుల రాంమూర్తి, జవహర్‌నగర్ దళిత సంక్షేమ సంఘంనేత మేడ రవితోపాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని పెద్దఎత్తున నిరసన తెలియజేశారు. జవహర్‌నగర్ పోలీసులు వచ్చి జీహెచ్‌ఎంసీ లారీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని చెత్తలారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చెత్తలారీలో తీసుకువచ్చి అవమానపరిచిన జీహెచ్‌ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంఘాల నేతలు సాయంత్రం మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మకు ఫిర్యాదు చేశారు.
విగ్రహాన్ని జాగ్రత్తగా తరలించాం
పంజగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై జీహెచ్‌ఎంసీ వారికి సమాచారం ఇచ్చాం. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేనందున దానిని తొలగించాలని కోరడంతో జాగ్రత్తగా దానిని తీసి ప్రైవేట్ లారీలో ఎస్కార్ట్‌తో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించాం. అక్కడ కూడా జాగ్రత్తగా అమర్చి వచ్చాం.
– ఏసీపీ తిరుపతన్న
ఐఏఎస్ అధికారితో విచారణ
అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన సంఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఘటనలపై విచారణ జరపాలని నగర పోలీస్ కమిషనర్‌ను కోరాం. జీహెచ్‌ఎంసీకి చెందిన ఐఏఎస్ అధికారితో కూడా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. యూసుఫ్‌గూడ నుండి విగ్రహం బయటకు రావడానికి బాధ్యులైన యార్డ్ ఆపరేటర్ బాలాజీని విధుల నుంచి తొలగించాం.
– జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్
రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు
జీహెచ్‌ఎంసీ చెత్తలారీలో అంబేడ్కర్ విగ్రహం
శనివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గుడిమల్లి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది దళిత సంఘాల నేతలు పంజగుట్ట కూడలి వద్దకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఐదడుగుల దూరంలో సుమారు నాలుగడుగుల గొయ్యి తీశారు. కాంక్రీట్‌తో ఐదడుగుల దిమ్మె నిర్మించి, దానిపైన 9 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అరగంట వ్యవధిలో విగ్రహ ఏర్పాటు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సుభాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని, పోలీసులు దానిని తొలగించాలని కోరారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. పశ్చిమమండల పోలీసులు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, కేంద్ర బలగాలు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని డంప్‌యార్డుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment