మున్సిపాల్టీ పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం పట్టణ శివారున ఉన్న డంపింగ్ యార్డు చాలకపోవడంతో పాటు చెత్తంతా
పార్వతీపురం రూరల్ :మున్సిపాల్టీ పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం పట్టణ శివారున ఉన్న డంపింగ్ యార్డు చాలకపోవడంతో పాటు చెత్తంతా ప్రధాన రోడ్డుపైకి వచ్చేయడంతో మున్సిపల్ అధికారులు కొత్తగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలసేకరణ పనిలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలోని చినమరికి గ్రామ సమీపంలో యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించి, ట్రాక్టర్ల సహాయంతో చెత్తను పారబోసేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామ సమీపంలో చెత్తను వేసేందుకు గ్రామస్తులంతా వ్యతిరేకించి అప్పట్లో ఆందోళనలు చేపట్టారు. అధికారులు ఎంత నచ్చచెప్పినా వారంతా ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
అయితే మున్సిపాల్టీలో రోజు రోజుకూ పెరుగుతున్న చెత్తను పారబోసేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు స్థలసేకరణ పనిలో పడ్డారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు, తహశీల్దార్ కేడీవీ ప్రసాదరావు నర్సిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. అయితే గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు, గ్రామపెద్దలకు మాటమాత్రమైనా చెప్పకుండా గ్రామ రెవెన్యూ పరిధిలో స్థల పరిశీలన చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుమంటున్నారు.
గ్రామస్తుల అనుమతి లేకుండా ఏ విధంగా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తారో చూస్తామని గ్రామపెద్దలు అంటున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ గొట్టాపు గౌరి స్పష్టం చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా మున్సిపల్ అధికారులు గ్రామంలో ప్రవేశించి డంపింగ్ యార్డుకు స్థలపరిశీలన చేయటమేమిటని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. మరి మున్సిపల్ అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి మరి.