నిర్లక్ష్యం.. చెత్త కుప్పలో ఆధార్ కార్డులు
నిర్లక్ష్యం.. చెత్త కుప్పలో ఆధార్ కార్డులు
Published Sun, Sep 3 2017 10:08 AM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
సాక్షి, రాజస్థాన్: అధికారుల నిర్లక్ష్యం ప్రజా సేవలకు ఎంత విఘాతం కలిగిస్తుందో మరోసారి బయటపడింది. అల్వార్ జిల్లాలోని ఓ చెత్తకుప్పలో వేల కొద్ది లెటర్‌లు, ఆధార్ కార్డులు దర్శనమిచ్చాయి. ఏడాదిగా వీటిని బట్వాడా చేయకుండా ఇలా పడేసినట్లు తెలుస్తోంది.
గద్‌బసాయి అటవీ ప్రాంతంలోని డంప్ యార్డ్‌లో కొందరు వ్యక్తులు రెండు సంచులలో వీటిని తీసుకొచ్చి పడేశారు. అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు అది గమనించి థానా ఘజి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు సంచులను సోదా చేయగా వాటిలో 3000 వేల ఉత్తరాలు, 100కు పైగా ఆధార్ కార్డులు బయటపడ్డాయి. అందులోని లేఖలన్నీ సంఘనర్ గ్రామానికి చెందిన అడ్రస్‌లతో ఉన్నట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ అమిత్ కుమార్ తెలిపారు.
బట్వాడా చేయకుండా వీటిని పడేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన అన్నారు. లేఖలు, ఆధార్ కార్డులతోపాటు పెళ్లి శుభలేఖలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సరిస్కా ప్రాంతం పక్కనే ఉండటంతో బహుశా ఆ పోస్టల్ కార్యాలయం నుంచే ఇవి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విషయాన్ని పోస్టల్ ఉన్నతాధికారులకు చేరవేశామని అమిత్ వెల్లడించారు. కాగా, ఘటనపై స్పందించేందుకు పోస్టల్ శాఖ అధికారులు నిరాకరించారు.
Advertisement
Advertisement