Saloni Sacheti: బాన్సూలీ అంటే ఏమిటో తెలుసా.. ఈ నగలు ధరిస్తే! | Saloni Sacheti Starts handcrafted bamboo Jewellery healps to tribal womens | Sakshi
Sakshi News home page

Saloni Sacheti: బాన్సూలీ అంటే ఏమిటో తెలుసా.. ఈ నగలతో...

Published Thu, Sep 23 2021 12:53 AM | Last Updated on Thu, Sep 23 2021 10:54 AM

Saloni Sacheti Starts handcrafted bamboo Jewellery healps to  tribal womens - Sakshi

సలోని లా కాలేజి విద్యార్థి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ మారుమూల ప్రాంత వాసులను కలిసే అవకాశం వచ్చింది. వచ్చామా, పని చూసుకుని వెళ్లామా అనుకోలేదు సలోని. తన ఇంటర్న్‌షిప్‌తోపాటు పర్యటిస్తోన్న గ్రామాల్లో.. ముఖ్యంగా గిరిజనుల ఆర్థికస్థితిగతులు, జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంది. వీరికోసం ఏదైనా చేసి మంచి జీవితం ఇవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఐదుగురు మహిళలతో కలిసి వెదురుతో జ్యూవెలరీని తయారు చేయించడం మొదలు పెట్టింది. ఈ వెదురు నగలు అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో విక్రయాలు బాగానే జరిగేవి.

గిరిపుత్రికలకు శిక్షణ ఇస్తున్న సలోని

అలా 13 నెలలు గడిచిపోయాక సలోని ప్రాజెక్టు వర్క్‌ పూర్తయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లడం, ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ వెదురుతో జ్యూవెలరీ తయారు చేస్తూ ఉపాధి పొందవచ్చని గ్రహించిన గిరిజన మహిళలు .. తమ జ్యూవెలరీ వర్క్‌ను మరింత ముందుకు తీసుకెళ్లమని సలోనిని అడగడంతో.. సలోనికి మళ్లీ రంగంలో దిగక తప్పలేదు. వెంటనే ‘బాన్‌సూలి’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించి.. గిరిజన మహిళలు సొంత ఊరు వదిలి, వలస వెళ్లకుండా అక్కడే ఆనందంగా, ఆర్థిక భరోసాతో జీవించేలా ఉపాధి కల్పిస్తోంది.

అల్వార్‌ అమ్మాయి
రాజస్థాన్‌లోని అల్వార్‌లో మార్వారి జైన్‌ కుటుంబంలో జన్మించింది సలోని సఛేతి. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ హానర్స్‌ ఫిలాసఫీ చేసింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే సలోని కాలేజీలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. డిగ్రీలో బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డు కూడా అందుకుంది. బిఏ తరువాత బనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీలో చేరింది. ఎల్‌ఎల్‌బీ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గుజరాత్‌లోని డ్యాంగ్‌ జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకునేది. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాలను పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధిలేక పేదరికంతో అల్లాడడం చూసింది. పొట్టచేతబట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్తున్న వారి దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి 2009లో ‘బాన్‌ సూలి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది.

బాన్సూలీ అంటే
బాన్‌ అంటే వెదురు. సూలీ అంటే నగలు బాన్సూలీ అంటే నగల నమూనా అని అర్థం. బాన్సూలీ ద్వారా డ్యాంగ్‌ జిల్లా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ అధికంగా దొరికే వెదరును జూవెలరీ తయారీలో వినియోగించడం విశేషం. సమకాలిన ఫ్యాషన్‌కు అద్దం పట్టేలా వెదురుకు రాళ్లు, రత్నాలు, పూసలు జోడించి జ్యూవెలరీని తయారు చేస్తున్నారు. ఎక్కువ బరువు లేకుండా కేవలం ఏడు నుంచి పది గ్రాముల్లోపే ఆకర్షణీయమైన ఆభరణాలను రూపొందించి విక్రయిస్తున్నారు. తొలినాళ్లలో ఆర్యా, మిమనాస, ద్యుతి, బోగన్‌ విలియ డిజైన్లను రూపొందించగా, ప్రస్తుతం రెండువందలకు పైగా విభిన్న రకాల డిజైన్లను తయారు చేసి విక్రయిస్తున్నారు.

వీటిలో జ్యూవెలరీతోపాటు లాప్‌టాప్‌ స్టాండ్స్, లైట్‌ స్టాండ్స్, రాఖీలు, దియాలు, కిచెన్, గృహాలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ప్రారంభంలో బాన్సూలీ  డిజైన్లను... ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేజీలు క్రియేట్‌ చేసి వాటిల్లో వీరి సరికొత్త వెదురు జ్యూవెలరిని అప్‌లోడ్‌ చేసేవాళ్లు. అంతేగాక వివిధ నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్‌లలో స్టాల్స్‌ ఏర్పాటు చేసి వెదురు నగలను ప్రదర్శించేవారు. వీటికి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొరియర్‌ కంపెనీలతో కలిసి బాన్సూలీ జ్యూవెలరినీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బాన్సూలీ పదిహేనులక్షల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తోంది. దీని ద్వారా దాదాపు నలభై మంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు.

ఫోర్బ్స్‌ జాబితాలో...
బాన్సూలీ ఉత్పత్తుల విక్రయాలు ఆశించిన దానికంటే అధికంగా జరగడంతో అనేక సంస్థలు సలోని కృషికి గుర్తింపుగా వివిధ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘అండర్‌–30’ జాబితాలో సలోని పేరు ఉండడం విశేషం. ఇవేగాక 3ఎమ్‌ సీఐఐ ఇన్నోవేటర్‌ ఛాలెంజ్‌ అవార్డు, ఎన్‌ఐఆర్‌డీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ‘‘బెస్ట్‌ స్టార్టప్‌ అవార్డు’’, టాప్‌ 18 సోషల్‌ ఇన్నోవేటర్, సోషల్‌ సెక్టార్‌లో ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌ అవార్డులను దక్కించుకుంది. ఒక్క గుజరాత్‌లోనేగాక వెదురు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాల్లో బాన్‌సూలిని విస్తరించనున్నట్లు సలోని చెబుతోంది.

చదవండి: Humans Of Patuli: కొత్త చీరలు కొని డొనేట్‌ చేస్తున్నారు.. ఎందుకంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement