రగులుతున్న రామాపురం | vijaya sai reddy talks with ramapuram village people | Sakshi
Sakshi News home page

రగులుతున్న రామాపురం

Published Fri, Jun 16 2017 11:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

రగులుతున్న రామాపురం

రగులుతున్న రామాపురం

► డంపింగ్‌ యార్డు తొలగింపు కోరుతూ ఆందోళన
► కంపోస్టు వాహనాలు రాకూడదంటూ బైఠాయింపు
► గ్రామస్తులకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి మద్దతు
► రంగంలోకి దిగిన పోలీసులు, వెనక్కి తగ్గేది లేదంటున్న గ్రామస్తులు


రామచంద్రాపురం మండలం రామాపురం డంపింగ్‌ యార్డు సమస్యతో రగిలిపోతోంది. పక్కనే ఉన్న తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్‌ యార్డును వెంటనే ఎత్తేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. రెండు రోజులుగా తిరుపతి కార్పొరేషన్‌ వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కుప్పలు కుప్పలుగా పెరిగిన కంపోస్టు కారణంగా జనం రోగాల బారిన పడి ఊరి మనుగడే ప్రశ్నార్థకమైందని గ్రామస్తులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి గ్రామస్తులకు మద్దతు పలికి డంపింగ్‌ యార్డును ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం పక్కనే తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్‌ యార్డు ఉంది. నగరంలోని చెత్తాచెదారం, ఇతరత్రా వ్యర్థపదార్థాలను లారీల్లో తెచ్చి ఇక్కడే అన్‌లోడ్‌ చేస్తుంటారు. ఇది 12 ఏళ్లుగా జరుగుతోంది. తిరుపతి నుంచి కంపోస్టు లోడ్‌తో వెళ్లే మున్సిపల్‌ వాహనాలన్నీ రామాపురం మీదగానే యార్డుకు వెళతాయి.  తమ గ్రామం పక్కనున్న డంపింగ్‌యార్డును ఎత్తేసి మరో చోట పెట్టుకోవాలని గ్రామస్తులు రెండేళ్లుగా అడుగుతున్నారు.

డంపింగ్‌యార్డు వల్ల గ్రామస్తులు త్వరగా రోగాల బారిన పడుతున్నారనీ, తరచూ జ్వరాలు, విరేచనాలు అవుతున్నాయనీ, ఎంతో మందికి డెంగీ జ్వరాలు కూడా వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రామంలోని భూగర్భ జలాలను పరీక్షించిన క్లినికల్‌ లేబొరేటరీ సిబ్బంది కలుషితమైన నీటిపై నివేదిక ఇచ్చారు. భూగర్భ జలాలు తాగితే ప్రమాదమని హెచ్చరించారు కూడా. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్తులు ఇటీవల మరోసారి అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం
డంపింగ్‌ యార్డు దగ్గర 6 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల వేస్ట్‌ ఎనర్జీ ప్లాంటును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గతంలో శంకుస్థాపనలు కూడా జరిగాయి. మరో వారంలో పనులు మొదలు కావాల్సి ఉంది. ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయితే రోజుకు 600 టన్నుల కంపోస్టును తీసుకుని విద్యుదుత్పత్తి చేస్తారు. అయితే ప్లాంట్‌ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఎప్పుడూ డంపింగ్‌ యార్డును తొలగించబోరని గ్రామస్తులు గుర్తించారు. దీంతో రెండు రోజుల నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు.

బుధ, గురువారాల్లో కంపోస్టు వాహనాలను అడ్డుకుని రోడ్లమీదనే పోయించారు. గ్రామానికి చెందిన 20 మందికి పైగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లు మీదనే బైఠాయిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి సతమతమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్‌ యార్డును తొలగించి మరో చోట పెట్టుకోవాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాదన. ఇందుకోసం ఎందాకైనా వెళతానని ఆయన స్పష్టం చేస్తున్నారు.

డంపింగ్‌ యార్డు ఎత్తేయాల్సిందే
మున్సిపల్‌ డంపింగ్‌ యార్డును తక్షణమే అక్కడి నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవా లని ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులకు సూచించా రు. డంపింగ్‌ యార్డు కారణంగా రామాపురంవాసుల ఆరోగ్యం దెబ్బతింటోందనీ, భూగర్భ జలాలు మొత్తం కలుషితమై జనం రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.  డంపింగ్‌ యార్డును వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన రామాపురం వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.

డంపింగ్‌ యార్డు వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎంపీకి వివరించారు.  కంపోస్టు యార్డు వల్ల 15 ఏళ్లుగా పడుతున్న ఇక్కట్లను, దెబ్బతింటున్న ఆరోగ్యాన్ని మహిళలు కూడా విశదీకరించారు. దీనిపై మున్సిపల్‌ అధికారులతో మాట్లాడతానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. డీఎస్పీ నంజుండప్పతోనూ, తహసీల్దార్‌ భాగ్యలక్ష్మితోనూ ఎంపీ మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు చొక్కారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల  అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విడుదల మాధవరెడ్డి ఉన్నారు.

ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రసక్తే లేదు...
ఎప్పుడో పన్నెండేళ్ల కిందట ప్రభుత్వం దుర్గసముద్రం, రామాపురం గ్రామాల మధ్య 25 ఎకరాల స్థలాన్ని కార్పొరేషన్‌కు అప్పగించింది. అప్పట్లో డంపింగ్‌ యార్డును అక్కడే ఖరారు చేశారు. అప్పటి నుంచీ కంపోస్టును అక్కడే డంప్‌ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గ్రామస్తులకు ఇబ్బందికరమైతే ప్రత్యామ్నాయంగా యార్డు చుట్టూ స్ట్రెంచ్‌ తీయడం, లేదా పవర్‌ జనరేషన్‌ కోసం వినియోగించడం జరగాలి. వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ పూర్తయితే చెత్తాచెదారం నిల్వ ఉండే ప్రసక్తి లేదు. ఇందుకోసం మరోసారి గ్రామస్తులు, రాజకీయ నాయకులతో చర్చించాల్సి ఉంది. – హరికిరణ్, కమిషనర్, తిరుపతి కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement