
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పార్టీ నేతలు అడుగు కలిపారు. ప్రజా సంకల్ప యాత్రను 47వ రోజు వసంతపురం నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోరెడ్డివారికోట వద్ద ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు భుజాన పార్టీ జెండా పెట్టుకొని అధినేతతో కలిసి నడిచారు.
పాదయాత్రకు అపూర్వ స్వాగతం
మరోవైపు తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజల బ్రహ్మారథం పడుతున్నారు. రాజన్న బిడ్డ మన వాడకు వచ్చాడంటూ ఆయా గ్రామాల ప్రజలు జననేతకు పూలతో స్వాగతం పలుకుతూ వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం కొత్తపల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వైఎస్ జగన్ మొక్క నాటారు. అనంతరం కొత్తపల్లి మీదుగా బోరెడ్డివారికోటకు చేరిన ఆయన అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రెడ్డి బోరెడ్డివారికోటలో ప్రజలతో మమేకం అయిన ఆయన... స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అలాగే మన ప్రభుత్వం రాగానే అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటానని, డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేసి ఆ డబ్బులు మీ చేతికే ఇస్తామని జగన్ తెలిపారు.
జగన్‌ను కలిసిన కేశవరెడ్డి బాధితులు
చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కేశవరెడ్డి విద్యా సంస్థల బాధితులు కలిశారు. బోరెడ్డివారిపల్లెలో బాధిత కుటుంబాలు శనివారం ఆయనను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పిల్లలు చదువుకునేందుకు అప్పులు చేసి కేశవరెడ్డి స్కూల్‌లో డిపాజిట్ రూ.2.75 లక్షలు చేశామన్నారు. అయితే కేశవరెడ్డి యాజమాన్యం ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని కొత్తపల్లికి చెందిన ఓ మహిళ వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు అడిగితే సమాధానం చెప్పే నాథుడు లేడని, తమ పిల్లలను ఎలా చదివించుకోవాలో దిక్కు తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సమస్యలు సావధానంగా విన్న ఆయన... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)