సంకల్పానికి జై | YS jagan Chittoor Praja Sankalpa Yatra Special Story | Sakshi
Sakshi News home page

సంకల్పానికి జై

Published Mon, Jan 7 2019 12:35 PM | Last Updated on Mon, Jan 7 2019 12:35 PM

YS jagan Chittoor Praja Sankalpa Yatra Special Story - Sakshi

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసిన పలమనేరుకు చెందిన సీనియర్‌ నాయకుడు రాజేంద్రన్‌ (ఫైల్‌)

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులుపుట్టించింది. అలుపెరుగని ధీరుడికి జిల్లా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీకి జై కొట్టారు. టీడీపీ రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి క్యూకట్టారు. వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అండగా నిలిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర జిల్లాలో 23 రోజులపాటు కొనసాగింది.  

సాక్షి, చిత్తూరు, తిరుపతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జిల్లా అధికార పార్టీ నాయకులకు కునుకులేకుండా చేసింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతూ వచ్చిన నాయకులు ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం పెంచుకున్నారు. ఒక్కొక్కరూ ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం ప్రారంభించారు. ఈ పరిణామాలు టీడీపీ అగ్రశ్రేణి నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల మీదుగా సాగిన పాదయాత్రకు అన్ని వర్గాల వారు నీరాజనం పలికారు. అధికార టీడీపీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పాదయాత్రలో స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీకి చెందిన అనేకమంది నాయకులు వైఎస్‌ జగన్‌ వెంట నడవటానికి సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి వేలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులతో టీడీపీ శ్రేణులు సదుం వద్ద సాగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలియజేశాయి.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెనుమార్పులు
పాదయాత్ర అనంతరం తంబళ్లపల్లె్ల నియోజకవర్గంలో  భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పెద్దతిప్పసముద్రం మండలానికి చెం దిన టీడీపీ మండల పరిషత్‌ అధ్యక్షురాలు కొండా గీతమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్ధార్థ, సింగిల్‌విండో చైర్మన్‌ ఎం.భాస్కర్‌రెడ్డి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కే.చంద్రశేఖర్, సంపతికోట మాజీ సర్పంచ్‌ రవీంద్రారెడ్డి, మాజీ మం డల పరిషత్‌ అధ్యక్షురాలు రేణుకా, టీడీపీ మం డల అధ్యక్షుడు మల్లికార్జున పాదయాత్ర అనంతరం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ములకలచెరువు మండలానికి చెందిన బీజేపీ మాజీ ఎంపీటీసీ నిర్మలమ్మ, బీజేపీ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతురెడ్డి, మాజీ వార్డు సభ్యుడు కరుణాకర్‌ వైఎస్సార్‌సీపీకి జై కొట్టారు. పెద్దమండ్యం మండలానికి చెందిన టీడీపీ వెలిగల్లు మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. కురబలకోట మండలానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌లు మల్లయ్య, నాగరాజు, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రఘనాథరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. తంబళ్లపల్లె మండలానికి చెందిన టీడీపీ సీని యర్లు సినిమా చిన్నరెడ్డి, మల్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బి.కొత్తకోట మండలానికి చెందిన కాంగ్రెస్‌ మైనార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి అమీర్‌సాబ్, టీడీపీ  ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బాలరమణమ్మ, టీడీపీ గట్టు గ్రామకమిటీ మాజీ అధ్యక్షుడు నారాయణస్వామి పార్టీలో చేరారు. నియోజక వర్గంలోని ప్రతిపల్లె నుంచి టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పార్టీలో చేరి మద్దతు ప్రకటించారు.

చంద్రగిరి కోటకు బీటలు!
వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న జనాధారణను చూసి మాజీ మంత్రి, చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ గల్లా అరుణకుమారి అస్త్రసన్యాసం తీసుకున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఎర్రావారిపాళెం మండలంలో బోడేవాండ్లపల్లి, నెరబైలు, ఉస్తికాయలపెంట, యలమంద పంచాయతీల్లో టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి భారీగా వైఎస్సార్‌సీపీలో చేరారు. తిరుపతి రూరల్‌ మండలంలో పాదయాత్ర ప్రభావం ఎక్కువగా ఉంది. మేజర్‌ పంచాయతీలైన శెట్టిపల్లి, పద్మావతీపురం, వేదాంతపురం, కుంట్రపాకం పంచాయతీల నుంచి టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలోకి క్యూకట్టారు. పాకాల మండలంలో వైస్‌ ఎంపీపీ బాలశంకర్‌తో పాటు కీలకమైన రెండు కమ్యూనిటీలకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ మండలంలో దాదాపు అన్ని పంచాయతీల నుంచి ఈ వలసలు ప్రారంభమయ్యాయి. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తర్వాత తిరుపతి రూరల్, పాకాల, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో పార్టీ మరింత బలపడింది. నగరి నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ నాయకుల ఆరాచకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఆత్మస్థైర్యాన్ని నింపింది.

కరువుగడ్డపై చిగురించిన ఆశలు..
ప్రజాసంకల్పయాత్ర తర్వాత మదనపల్లె నియోజకవర్గం నీరుగట్టువారిపల్లెలో వందలాది చేనేత కుటుంబాలు ఏళ్లుగా నమ్ముకున్న టీడీపీని వదిలి వైఎస్సార్‌ సీపీలో చేరారు. బీసీ కులాలు టీడీపీ పక్షం అన్న మాటను తుడిచేస్తూ వేల సంఖ్యలో తొగటవీర క్షత్రియ, పద్మశాలి, వడ్డెర, కురబ, పాల ఏకరి, యాదవ కులాలకు చెందిన ఎందరో వ్యక్తులు తమంతట తాముగా వచ్చి వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌సీపీలో తమందరికీ సముచిత స్థానం ఉంటుందని, నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతాయని భావించి జగన్‌ మీద నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. మొదటి నుంచి మైనార్టీలకు వైఎస్సార్‌ సీపీకి అండగా నిలుస్తోందంటూ మదనపల్లెకు చెందిన అనేకమంది మైనార్టీ కుటుంబాలు పార్టీలో చేరాయి. నిమ్మనపల్లె మండలంలో మరాఠా కుటుంబాలకు చెందిన వ్యక్తులు, రామసముద్రం మండలం కేసీపల్లె పంచాయతీలో వందల కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలోకి చేరాయి. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీటీఎంలో బీసీల సదస్సు, కల్లూరులో మైనారిటీల సదస్సు, దామలచెరువులో రచ్చబండ, అనుప్పల్లిలో రైతు సదస్సు, పాపానాయుడుపేటలో బీసీల సదస్సు, పల్లమాలలో ఎస్సీల సదస్సులను నిర్వహించి ఆయావర్గాల వారికి నవరత్రాల ద్వారా జరిగే ప్రయోజనాలను వైఎస్‌ జగన్‌ వివరించారు. పది నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించి పాలకపక్షం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. టీడీపీలో మొదటి నుంచి ఉన్నా... ప్రజల్లో ఇంత ప్రజాదరణ లేదని అధికార పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం విశేషం.

పలమనేరుకు కొత్త ఉత్సాహం
పలమనేరులో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర జరగకపోయినా పాదయాత్ర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి టానిక్‌లా ఉపయోగపడింది. వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథరెడ్డి స్వలాభం కోసం పార్టీని వీడి టీడీపీలో చేరారు. పలమనేరులోని పార్టీలో సందిగ్ధం నెలకొంది. అటువంటి సమయంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొత్త నాయకుల ప్రాతి నిథ్యానికి దారులు తెరిచింది. నియోజకవర్గ కో–ఆర్డినేటర్లుగా మొగసాల రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేష్‌రెడ్డి పార్టీని బలోపేతం చేసేం దుకు జిల్లాలో జరిగిన పాదయాత్ర ఎంతో ఉపకరించింది. ఆ తరువాత నియోజకవర్గ సమన్వయకర్తగా వెంకటేగౌడ్, రెడ్డెమ్మ, రాకేష్‌రెడ్డి, సీవీ కుమార్‌తో కలసి మెలసి పార్టీ ని మరింత పటిష్టం చేశారు. పాదయాత్ర సమయంలో పలమనేరు నియోజకవర్గ నాయకులు, తటçస్థులు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్‌ కుమారుడు టీసీ బాబు, ఆకుల గజేంద్ర ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తటçస్థంగా ఉన్న మాజీ ఎంపీపీ, తదితరులు వైఎస్‌ జగన్‌ని కలుస్తూ మద్దతు తెలియజేయడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత పుం జుకుంది. అప్పటి దాకా మంత్రి అమర్‌కి ప్రధాన మద్దతుదారుడిగా ఉన్న ఆకుల గజేం ద్రప్రసాద్‌ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పట్టణంలో పార్టీలకు సంబంధం లేని పలువురు ప్రముఖులు సోమచంద్రారెడ్డి, ఎంహెచ్‌ ఖాన్, శ్రీపురం సీతారామయ్య వైఎస్‌ జగన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. ఇలా జిల్లాలో పాదయాత్ర జరిగినన్నీ రోజులూ వేలాదిమంది నియోజకవర్గవాసులు జననేతతో కలిసి అడుగులేస్తూ   మద్దతు తెలపడం స్థానికంగా పార్టీలో నూతనోత్సానికి దారితీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement