ప్రతి అడుగూ పండగే | YS Jagan Chittoor Praja Sankalpa Yatra Special Story | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగూ పండగే

Published Wed, Jan 9 2019 12:25 PM | Last Updated on Wed, Jan 9 2019 12:25 PM

YS Jagan Chittoor Praja Sankalpa Yatra Special Story - Sakshi

ఏడాది క్రితం..ఇవే రోజులు..జిల్లా అంతటా పండుగ వాతావరణం..సంక్రాంతి ముందుగానే వచ్చినంత కోలాహలం.. రోడ్ల మీద కూడా రంగవల్లులు..ప్రతి గుండెలో సందడి..ఆత్మీయ నేతను కలుస్తున్నామన్న ఆనందం..టీడీపీ పాలనలో అనుభవిస్తున్న కష్టాలను వినే నాయకుడొస్తున్నాడనే కొండంత సంబరం.. బిడ్డ నుంచి అవ్వాతాతల వరకూ అందరిలోనూ అనిర్వచనీయ అనుభూతి..రాజన్న బిడ్డ..జగన్‌మోహన్‌రెడ్డి తమ మధ్య ఉంటే పండుగ కాక మరేంటి.. గతేడాది ఇదే రోజుల్లో సంకల్పయాత్ర జిల్లా మీదుగా సాగినప్పుడు ప్రజా గుండెల్లో సంక్రాంతులు వెల్లివిరిశాయి. ఆయన ప్రతి అడుగూ మాకు పండగేనని జనం సంబరపడ్డారు. తమ కష్టాలను వైఎస్సార్‌సీపీ అధినేత ముందు వివరించారు. అందరి ఇంటా సంక్షేమం గూడు కట్టుకునే రోజు తొందర్లోనే రానుం దంటూ జగనన్న ఇచ్చిన భరోసాతో వారంతా మురిసిపోయారు. కాగా నేడు పాదయాత్ర ముగుస్తున్న తరుణంలో నాటి స్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. రావాలి..జగన్‌..కావాలి జగన్‌ అంటూ ఆకాంక్షిస్తున్నారు.

చిత్తూరు, సాక్షి: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రతో కరువు జిల్లా పులకించింది. అలుపెరుగని అడుగులను ఆత్మీయంగా ముద్దాడింది. పట్టణం, పల్లె తేడాలేకుండా హారతులిస్తూ నీరాజనాలు పలికింది. అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోకి 2017 డిసెంబర్‌ 28న ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. 23 రోజుల పాటు 18 మండలాల్లో 291.1 కి.మీ మేర పాదయాత్ర సాగింది.

మనోధైర్యం
చంద్రబాబు పాలనలో పేదల బతుకులు మరింత దిగజారాయి. దగాపడ్డాయి. సంక్షేమం అమలు మొత్తం జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయింది. అణగారిన బతుకులు నిలువు దోపిడీకి గురయ్యాయి. ఇలాంటి దశలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాలో ప్రవేశించింది. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. దళితుల జీవితాల్లో ఆశాకాంతులు నింపింది. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను వెన్నుతట్టి ప్రోత్సహించింది.

పులకించిన కరువు నేల
ప్రజాసంకల్పయాత్రతో కరువునేల పులకించింది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి రైతులు అడుగడుగునా వెనుదన్నుగా నిలిచారు. ఎద్దులవారి కోట దగ్గర టమాట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వారు ఉప్పొంగిపోయారు. జిల్లాలోని పది లక్షల మంది పాడి రైతులకు రూ.4 రాయితీతో లబ్ధిచేకూర్చుతామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో జరిగిన రచ్చబండలో సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సొంత ఊరికి కూడా ఏమీ చేయలేని చంద్రబాబు ప్రజలకేం చేస్తారని మండిపడ్డారు.

దళితుల నుంచే భూపంపిణీ
సత్యవేడులో ఎస్సీ, ఎస్టీలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని  హామీ ఇచ్చారు. భూ పంపిణీ కూడా దళితుల నుంచే మొదలు పెడతామని హామీ ఇచ్చారు.
10 వేల మంది ఉద్యోగులకు లబ్ధి
ఆర్టీసీ విలీన ప్రకటన జిల్లాలోనే వెలువడింది. సదుంలో జరిగిన బహిరంగ సభలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జననేత హామీ ఇచ్చారు. ఈ హామీ జిల్లాలోని పది వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.

అమ్మలో నమ్మకం..అవ్వాతాతల్లో ధైర్యం
‘కొడుకులు సరిగా చూసుకోలేదు నాయనా.. పింఛన్‌ మందులుమాకులకే సరిపోవడం లేదు’ అని ఓ అవ్వ రెడ్డిగుంట వద్ద జగన్‌ను కలిసి కన్నీటి పర్యంతమైంది. అవ్వ ఆవేదన జగన్‌ను కదిలించింది. మన ప్రభుత్వం వస్తూనే పెన్షన్‌ రూ.2 వేలు చేస్తానని హామీ ఇచ్చారు. కొడుకులు కూతుళ్లు చూసుకోలేకపోతే.. ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 సంవత్సరాలకే పింఛన్‌ ఇస్తామని చెప్పడంతో కొండంత ఊరటనిచ్చింది.  

చిత్తూరు, చంద్రగిరి:  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభంకావడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో సుమారు 52 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో అడుగడుగునా వినూత్నరీతిలో స్వాగతాలు పలుకుతూ, రాష్ట్రంలోనే ఎవరూ చేయలేని రీతిలో ఏర్పాట్లను చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నిపుణులతో భారీ స్వాగత ఆర్చ్‌లను ఏర్పాటు చేశారు. వందలాది మంది మహిళలు రోడ్డుకిరువైపులా  నిల్చొని అపూర్వ రీతిలో గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. పాదయాత్రకు మద్దతుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చాడా..? అన్న రీతిలో ఒకేసారి 99 మంది వైఎస్సార్‌ విగ్రహాలను మాస్క్‌లుగా ధరించి జననేతతో పాటు పాదయాత్రలో నడిచారు. రామచంద్రాపురం మండలంలో నిర్వహించిన రైతు సదస్సుకు వందలాది ట్రాక్టర్లలో రైతులు వచ్చి ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు.

విరిసిన సంక్రాంతులు
చంద్రగిరి:  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గత ఏడాది చంద్రగిరి నియోజకవర్గంలో వారం రోజుల పాటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన యాత్రను కొనసాగించారు. సంక్రాంతి పండుగను సైతం ఆయన నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లిలో అట్టహాసంగా జరుపుకున్నారు. ఆయన బస చేసిన పల్లె పరవశించింది. రంగవల్లులు, గొబ్బెమలు, డూడూ బసవన్నలతో ఆ ప్రాం తమంతా కోలాహలంగా మారింది. కుటుంబ సభ్యులతో కలసి మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే సంక్రాంతి వేడుకలను జరుçపుకున్నారు.

పల్లె పండుగ పరవశించింది
పెద్ద పండుగ జరుపుకోవడానికి అనుకోని అతిథిగా వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయన బసచేసే ప్రదేశానికి చేరుకున్నారు.  చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ ప్రాంతమంతా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లను చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన జగనన్నకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.

పుంగనూరు గోవు బçహూకరణ
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన అభిమాన నాయకుడికి పుంగునూరు గోవును బహూకరించారు. గోవును చూసి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మురిసిపోయారు. ఆప్యాయంగా అరటిపండు తినిపించారు.

మనసున్న మారాజు
వడమాలపేట: వడమాలపేట మండల పరిధిలోని పచ్చికాల్వ పంచాయతీకి చెందిన షేక్‌ ముజీబ్‌ బాషాది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. ఇతని రెండేళ్ల కుమారుడు షేక్‌ రిహానాకు పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్య. ఆపరేషన్‌కయ్యే ఖర్చును భరించే స్థోమత లేదు. గతేడాది జనవరి 16న సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డికి బాషా దంపతులు తమ గోడు వినిపించారు. రిహానాకు ఆపరేషన్‌ చేయిస్తానని జననేత మాట ఇచ్చారు.  గత ఏడాది ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం రిహానా వినగలుగుతున్నాడు. ఆపరేషన్‌ ఖర్చును జగన్‌ భరించారు. ఆయన పెద్ద మనసుకు తామెప్పుడూ రుణపడి ఉంటామని బాషా దంపతులు చెబుతున్నారు.

మా జీవితాల్లో వెలుగులొస్తాయ్‌
చిత్తూరు కార్పొరేషన్‌: వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే.. తమ జీవి తాల్లో వెలుగులొస్తాయని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశా రు. గత ఏడాది పూతలపట్టు నియోజకవర్గం తలుపులపల్లె వద్ద డిమాండ్ల సాధన కు ఉద్యోగులు దీక్ష చేశారు. అటువైపు పాదయాత్రగా వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడికి వినతిపత్రం ఇచ్చి.. తమకు న్యాయం చేయాలని కోరినట్లు కాంట్రాక్ట్‌ కార్మికుల జేఏసీ జిల్లా నాయకుడు సుధాకర్‌ తెలిపారు. సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించి, దశలవారీగా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఈ సందర్భంగా జగనన్న హామీ ఇచ్చారన్నారు. మహానేత వైఎస్సార్‌ హయాంలో ఉద్యోగుల జీతాలు పెంచి 7,000 మందిని ఒకేసారి క్రమబద్ధీకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement