
క్షమించు అమ్మా..
ఈ సంఘటన చూసిన వారికి చెమ్మ గిల్లాయే తప్పితే.. పెంచి పెద్ద చేసిన ఆమె సంతానానికి మాత్రం ఈమె మా అమ్మ అని గుర్తుకురాలేదు.
అమ్మ...
స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం..
నిస్వార్థతకు నిలువెత్తు నిదర్శనం..
తాను దహించుకుపోతూ..
తన సంతానానికి వెలుగునిస్తుంది.
కానీ కొంతమంది ఏం చేస్తున్నారు..
స్వార్థించడం.. సాధించడం..
సాగనంపడం తప్పితే..
అలాంటి హృదయ విదారకర
సంఘటన ఇది..
కాటికి కాలు చాపిన కన్నతల్లిని
నిర్ధాక్షిణ్యంగా వీధి పాలు చేసిన సంతానం వైనమిది.
ఈ సంఘటన చూసిన వారికి చెమ్మ గిల్లాయే తప్పితే.. పెంచి పెద్ద చేసిన ఆమె సంతానానికి మాత్రం ఈమె మా అమ్మ అని గుర్తుకురాలేదు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆటోలో మారేడుపూడి కూడలి వద్దకు వచ్చారు. అందులో 85 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని రోడ్డు పక్కనే పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్‌ను పిలుస్తుండగానే క్షణంలో ఆటో వెళ్లిపోయింది.
వృద్ధురాలు దుస్థితి ప్రత్యక్షంగా చూసిన వారిని కలచి వేసింది. వెంటనే ఆమెకు సపర్యలు చేసి, వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. స్థానికులు కుటుంబ సభ్యులను తిట్టిపోస్తూ.. వారికీ ఇటువంటి దుస్థితి ఏర్పడాలని శాపనార్థాలు పెట్టారు. మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ సాలాపు మోహన్ పరవాడ పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు.
- అనకాపల్లి రూరల్