- డంపింగ్ యార్డుగా తాండవ నది
- ప్లాస్టిక్ సంచుల శుభ్రంతో నీరు కలుషితం
- ఇలాగే వదిలేస్తే ఉనికికే ప్రమాదం
తాండవ నదిలో కలుషితం తాండవిస్తోంది. నది కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవ రాసులు బలైపోతున్నాయి. చె త్తా చెదారంతో తాండవ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నదికి రెండు పక్కలా ఆక్రమణలు చోటు చేసుకోగా, మరో పక్క డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారు. పాయకరావుపేట, తుని పట్టణాలకు తాగునీటితోపాటు వేలాది ఎకరాలకు సాగునీరందించే తాండవను ర క్షించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
పాయకరావుపేట: ప్రస్తుతం ఉన్న తాండవ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. ప్రజలకు, రైతులకు ఆందోళన కలిగిస్తోంది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ నది నాతవరం మండలం తాండవ నుండి ప్రవహిస్తూ నాతవరం, కోటనందూరు, పాయకరావుపేట, తుని పట్టణాల మీదుగా పెంటకోట వద్ద సముద్రంలో కలుస్తోంది. ఈ నదిపై ఆధారపడి తుని, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 22 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి.
జంట పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీరుస్తోంది. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న తాండవ తీరంలో తుని- పాయకరావుపేట పట్టణాలకు చెందిన వందలాది టన్నుల చెత్త వేస్తుండటంతో నది డంపింగ్ యార్డుగా మారింది. గతంలో తుని మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
గతేడాదిలో వచ్చిన నీలం తుపాను ధాటికి నది ఉధృతంగా ప్రవహించి నదిలో పేరుకు పోయిన చెత్త మంగవరం, కొత్తూరు, సత్యవరం, మాసాహెబ్‌పేట ప్రాంతాల్లో ఉన్న తమలపాకు తోటల్లోకి కొట్టుకుని వచ్చి నిలచిపోయంది. భారీగా వచ్చిన చెత్తను తొలగించలేక రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ముఠా ఆనకట్ట దిగువ భాగంలో అర ట్లకోట ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదికి చుట్టుపక్కల ఉన్న భూములు కోతకు గురయ్యాయి.
ముఠా ఆనకట్టకు వేసి రాతిపేర్పు చెల్లా చెదురైంది. దీనికి తోడు నదిలో సిమెంటు, ఎరువులు, సల్ఫర్ సంచులు శుభ్రంచేస్తున్నారు. తుని, పాయకరావుపేట పట్టణాల్లో వివిధ దుకాణాల్లో లభ్యమయ్యే ప్లాస్టిక్ సంచులు, గోనెలను నదిలో పూర్తిగా శుభ్రపరచి వాటిని రీసైక్లింగ్‌కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో నది పూర్తిగా కలుషితమవుతోంది. రెండు పట్టణాల్లో ఉన్న చేపలు మార్కెట్, చికెన్, మటన్‌సెంటర్ల నుండి వస్తున్న వ్యర్థాలను కూడా నదిలోనే పడేస్తున్నారు.
దీంతో నీరు కలుషితమై వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని పట్టణ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఇంత జరగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడితే నది కాలుష్యం నుండి రక్షించుకునే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు.