మ్యాప్ ద్వారా డంపింగ్‌యార్డు వివరాలను జస్టిస్ శేషశయనారెడ్డికి వివరిస్తున్న సీఈ సుధాకర్‌బాబు
పోలవరం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మూలలంక ప్రాంతంలోని డంపింగ్ యార్డు మట్టి జారిపోకుండా తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) బృందం మంగళవారం పరిశీలించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నాయకత్వంలో బృంద సభ్యులు కోట శ్రీహర్ష, టి.శశిధర్, ఎస్.మన్నివరం, హెచ్‌డీ వరలక్ష్మి, డి.సురేష్ పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డులు, ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్‌బాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తిల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బీసీ కాలనీ సమీపంలో ఉన్న 203 ఎకరాల డంపింగ్ యార్డు ఏమైనా జారిపోయిందా, మొక్కలు నాటారా.. కాలువ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు.
902 హిల్ ప్రాంతంలోని స్పిల్ చానల్ మట్టిని పోస్తున్న రెండు ప్రదేశాలను కూడా చూశారు. హిల్ వ్యూ పై నుంచి స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక, ఎగువ కాఫర్‌డ్యామ్, ట్విన్‌టన్నెల్స్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు మూలలంక డంపింగ్‌యార్డు కోసం తీసుకున్న 203 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారా లేదా అనే విషయాలను ఆరా తీశారు. 30 మంది రైతులు పరిహారం తీసుకోలేదని, వారికి సంబంధించిన సొమ్ము కోర్టులో జమచేశామని అధికారులు తెలిపారు. ఈ బృందం బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆ ప్రాంత వాసుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంది. ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ బి.సుమతి, ఈఈ మల్లికార్జునరావు, మేఘ జీఎం ఎ.సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment