సాక్షి, ఢిల్లీ: పోలవరం ముంపు ప్రాంతాల నివేదికలను తమకి కూడా అందజేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పీపీఏ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆ నివేదికలను ఎన్జీటీతో పాటూ, కేంద్ర పర్యావరణ నియంత్రణ బోర్డుకు అందించాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి ఎన్జీటీ ధర్మాసనం వాయిదా వేసింది.
పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై కమిటీ
ఏపీలోని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్లపైనా ఎన్జీటీలో విచారణ కొనసాగింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమో లేదో స్పష్టత లేదని ఎన్జీటీ పేర్కొంది. ఒకవైపు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ మరోవైపు ఏపీ ప్రభుత్వానికి షోకాజు నోటీసులు ఎందుకు ఇచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. పోలవరం మౌలిక సదుపాయాలు వినియోగించుకుంటే అనుమతులు అవసరం అని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.
ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో సమావేశం కావాలని కమిటీని ఆదేశించింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమో కాదో నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, తాత్కాలిక ప్రాజెక్టులను ఎన్జీటీ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా తాత్కాలికంగా నిర్మించామని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను మే 4కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment