ఉల్లిమూటలు తరలిస్తున్న దృశ్యం
బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన
దొడ్డబళ్లాపురం (కర్ణాటక): కర్ణాటకలో ఉల్లిపాయల లోడుతో వెళుతున్న 46 బోగీల గూడ్సు రైలు లూటీకి గురైంది. ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల సమీపంలోని బసవనహళ్లి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన బడా వ్యాపారులు ఉల్లిలోడును బీహార్‌కు తీసుకెళ్లారు. అవి నాసిరకంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించారు. దీంతో ఆ ఉల్లిని గూడ్సురైలులో నెలమంగల వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా.. బసవనహల్లి రైల్వే స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. దీంతో రైలును నిలిపివేశారు.
కాగా, ఉల్లిగడ్డలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా బసవనహల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. గూడ్స్ రైలు బోగీల తలుపులు తెరిచి ఆ ఉల్లిమూటలను బైక్‌లపై, ఇతర వాహనాల్లో తీసుకువెళ్లిపోయారు.