సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చెత్తవేసే డంపింగ్ గ్రౌండ్‌ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 13 ఏళ్ల నుంచి గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్తను నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టువల్ల వాతావరణం కాలుష్యమైపోతోంది. ఫలితంగా గోవండి ప్రాంత ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గడచిన పదేళ్లలో బీఎంసీకి చెందిన ఎం– తూర్పు వార్డు పరిధిలో 1,877 మంది క్షయ వ్యాధితో మృత్యువాత పడ్డారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. అంతేగాకుండా గడచిన పదేళ్ల కాలంలో 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గోవండీ, పరిసరాల్లో భీతావహ వాతావరణం నెలకొంది.
గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రకియ ప్రాజెక్టు వల్ల కమలారమణ్ నగర్, డింపింగ్ రోడ్, డా.జాకీర్ హుస్సేన్ నగర్, రఫిక్ నగర్, బాబానగర్, బైంగన్ వాడి, శివాజీనగర్, పీఎంజీపీ కాలనీ, టాటా నగర్ కాలనీ, ఇండియన్ ఆయిల్ నగర్, దేవ్‌నార్ తదితర పరిసరాల్లో కాలుష్యం పెరిగిపోయింది. దీని ప్రభావం అక్కడుంటున్న స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడసాగింది. దీంతో స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. కానీ వాటిని స్ధలాంతరం చేయడానికి బీఎంసీకి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. దీంతో అక్కడే కొనసాగిస్తూ వస్తున్నారు.
సామాజిక కార్యకర్త శేఖ్ ఫైయాజ్ ఆలం సమాచార హక్కు చట్టం ద్వారా బీఎంసీ ఎం–తూర్పు వార్డు పరిధిలో ఎంత మంది క్షయ రోగులున్నారో వారి వివరాలు సేకరించారు. అందులో 2013 నుంచి 2022 వరకు మొత్తం 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు తేలింది. అందులో 1,877 మంది చనిపోయినట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
కానీ క్షయ సోకిన వారు, మృతి చెందిన వారంతా బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల చనిపోయినట్లు నిర్ధారించాల్సిన అవరసం ఎంతైన ఉందని ఎస్‌ఎంఎస్ కంపెనీ అంటోంది. చెత్తను నిరీ్వర్యం చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని తెలిపింది. కొందరు స్థానికులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కంపెనీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment