
గుండెల్ని పిండేసే అమానుషం
ముంబై: ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల స్త్రీ పురుష నిష్పత్తి గణాంకాలు అందోళన పుట్టిస్తున్నాయి. మరోవైపు సమాజంలో అంతకంతకూ తీవ్రమవుతున్న భ్రూణ హత్యలు ఆడబిడ్డ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలో అత్యంత అమానవీయైన ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ మహారాష్ట్ర సాంగ్లి జిల్లాలోని ఒక గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 భ్రూణహత్యల దారుణ ఘటన కలకలం రేపింది.. గుండెలను పిండివేసే ఈ ఘటన ఆదివారం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఫిబ్రవరి 28 న ఓ 26 ఏళ్ల గర్భిణీ మృతిపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసలు ఈ రాకెట్ ను ఛేదించారు.
పోలీస్ సూపరింటెండెంట్ దత్రాత్రేయ షిండే అందించిన వివరాల ప్రకారం హోమియోపతిలో డిగ్రీ పొందిన బాధిత మహిళకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడవసారి కూడా కడుపులో ఉన్నది ఆడపిల్లే అని తెలిసిన ఆమె భర్త ప్రవీణ్ జామ్‌దాదే ఆమెకు డాక్టర్ డా. బాబాసాహెబ్ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భస్రావం చేయించాడు. దీంతో పరిస్థితి వికటించి ఆమె చనిపోయింది.
అయితే అబార్షన్‌ను తాను వ్యతిరేకించిననప్పటికీ భర్త ప్రవీణ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, తన కుమార్తె మరణానికి కారణమ య్యాడని మహిళ తండ్రి సునీల్ జాదవ్ ఆరోపించారు. అటు మహిళ మరణంపై గ్రామస్తులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా గ్రామంలోని ఓ గుంతలో పూడ్చిపెట్టిన 19 ఆడ పిండాల అవశేషాలు బైటపడ్డాయి.
ఈ భ్రూణ హత్యలను దాచి పెట్టే ఉద్దేశ్యంతో ఖననం చేసి ఉంటారని, ఇప్పటివరకూ 19 బాడీలను కనుగొన్నట్టు షిండే చెప్పారు. దీంతో ఆమె భర్తపైనా, వైద్యునిపైనా కేసులు నమోదు చేశమన్నారు. ఈ మొత్త వ్యవహారంపై విచారణ చేపట్టినట్టు తెలిపారు.