ఇండోర్ నగర పర్యటనలో గ్రేటర్ అధికారులు.. (ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అక్కడి యంత్రాంగం కంకణం కట్టుకుంది. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరంలో రూ.1.5. కోట్లు వసూలు చేశారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నగరమంతా రోడ్డుకు ఇరువైపులా ప్రతి 100 మీటర్లకు రెండు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. తడి–పొడి చెత్త ఇంటివద్దే వేరు చేయాల్సిందే. దుకాణాలు, హోటళ్లు, తదితర సంస్థల నుంచి ప్రతిరోజు వెలువడే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ చెత్త తరలింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అలా తక్కువ చెత్త వెలువడే దుకాణాలకు రూ.500 వసూలు చేస్తుండగా, పెద్ద హోటళ్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే కార్మికులకు నెలకు రూ.60 చెల్లిస్తున్నారు. చెత్త తరలింపు బండ్లలో తడి,పొడికి వేర్వేరు అరలే కాక నాప్కిన్లకు మరో డబ్బా కూడా ఉంచారు. చెత్త రవాణా కేంద్రాల్లో బయో మెథనైజేషన్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులతో పాటు కాలనీ సంఘాలు తదితరులకు ఎక్కడికక్కడే సేంద్రియ ఎరువు యంత్రాలను వినియోగించాల్సిందిగా అవగాహన కల్పించారు. రోజుకు పది కేజీల కన్నా ఎక్కువ చెత్త వెలువడే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఉంచారు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో వీటిని తప్పనిసరి చేశారు.
పార్టీ ఇస్తే చార్జి చెల్లించాల్సిందే..
ఏదైనా ఫంక్షన్ హాల్‌లో గానీ, రోడ్డుపై టెంటు వేసి వేడుక ఏర్పాటు చేసి విందు ఇస్తే ఎంతమంది హాజరు కానున్నారో మనిషికి రూ.50 చొప్పున సదరు పార్టీ నిర్వాహకులు కార్పొరేషన్‌కు ముందుగానే చెల్లించాలి. వ్యర్థాల తరలింపునకు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించకుంటే పెనాల్టీగా రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండోర్‌లోని స్థానిక ఎమ్మెల్యే ఒకరు ముందస్తు ఫీజు చెల్లించనందుకు అతని నుంచి రూ.50 వేల పెనాల్టీ వసూలు చేశారని అధ్యయనం చేసి వచ్చిన గ్రేటర్ అధికారులు తెలిపారు. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది.
చెత్త తరలింపు పర్యవేక్షణకు కన్సల్టెన్సీ..
ఇంటింటి నుంచి చెత్త తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఎన్విరాన్‌మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకుగాను ఒక్కో ఇంటికి నెలకు రూ.11 వంతున కార్పొరేషన్ చెల్లిస్తోంది. అక్కడ సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి చెత్తడబ్బాలను తయారు చేశారు. తరిగి ఒక్కో డబ్బాను రూ.25లకు ప్రజలకు విక్రయించారు.
టాయ్‌లెట్ల నిర్వహణ ఇలా..
ఒక్కో టాయ్‌లెట్ నిర్వహణకు ఇండోర్‌లో నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.7500 కేర్‌టేకర్‌కు చెల్లిస్తుండగా, రూ.7500 నిర్వహణకు వెచ్చిస్తున్నారు.
అక్కడ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేది 29 రోజులకే. ఆ ఒప్పందం ముగియగానే వారినే మళ్లీ తాజా ఒప్పందంతో తీసుకుంటారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్లు రాకుండా ఇండోర్‌లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
గతేడాది స్వచ్ఛ ర్యాంకింగ్‌లో దేశంలోనే నెంబర్–1గా నిలిచిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన అధికారులు ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చారు. వారు అధ్యయనం చేసిన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. అధ్యయనం చేసి వచ్చిన వారిలో జోనల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, హరిచందన, భారతి హొళికేరి, అడిషనల్ కమిషనర్ మనోహర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, శశికిరణాచారి తదితరులు ఉన్నారు. వారు తమ అధ్యయన నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నారు. వాటిలో నగరానికి అనువైన వాటిని త్వరలో అమలు చేయనున్నారు.
స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ..
ఇండోర్ కార్పొరేషన్ జనాభా 35 లక్షలు. విస్తీర్ణం 150 చ.కి.మీ. కమిషనర్‌తో పాటు నలుగురు అడిషనల్ కమిషనర్లు స్వచ్ఛ కార్యక్రమాలపైనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు. గతేడాది నెంబర్–1గా నిలవడంతో దాన్ని తిరిగి నిలుపుకుందామంటూ ఎక్కడ చూసినా ‘ఫిర్ రహేంగే’ ప్రకటనలు కనిపిస్తున్నాయని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment