Environmental service
-
గ్రేటర్.. ఇండోర్ రూట్
సాక్షి,సిటీబ్యూరో: ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అక్కడి యంత్రాంగం కంకణం కట్టుకుంది. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరంలో రూ.1.5. కోట్లు వసూలు చేశారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నగరమంతా రోడ్డుకు ఇరువైపులా ప్రతి 100 మీటర్లకు రెండు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. తడి–పొడి చెత్త ఇంటివద్దే వేరు చేయాల్సిందే. దుకాణాలు, హోటళ్లు, తదితర సంస్థల నుంచి ప్రతిరోజు వెలువడే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ చెత్త తరలింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అలా తక్కువ చెత్త వెలువడే దుకాణాలకు రూ.500 వసూలు చేస్తుండగా, పెద్ద హోటళ్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే కార్మికులకు నెలకు రూ.60 చెల్లిస్తున్నారు. చెత్త తరలింపు బండ్లలో తడి,పొడికి వేర్వేరు అరలే కాక నాప్కిన్లకు మరో డబ్బా కూడా ఉంచారు. చెత్త రవాణా కేంద్రాల్లో బయో మెథనైజేషన్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులతో పాటు కాలనీ సంఘాలు తదితరులకు ఎక్కడికక్కడే సేంద్రియ ఎరువు యంత్రాలను వినియోగించాల్సిందిగా అవగాహన కల్పించారు. రోజుకు పది కేజీల కన్నా ఎక్కువ చెత్త వెలువడే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఉంచారు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో వీటిని తప్పనిసరి చేశారు. పార్టీ ఇస్తే చార్జి చెల్లించాల్సిందే.. ఏదైనా ఫంక్షన్ హాల్లో గానీ, రోడ్డుపై టెంటు వేసి వేడుక ఏర్పాటు చేసి విందు ఇస్తే ఎంతమంది హాజరు కానున్నారో మనిషికి రూ.50 చొప్పున సదరు పార్టీ నిర్వాహకులు కార్పొరేషన్‌కు ముందుగానే చెల్లించాలి. వ్యర్థాల తరలింపునకు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించకుంటే పెనాల్టీగా రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండోర్‌లోని స్థానిక ఎమ్మెల్యే ఒకరు ముందస్తు ఫీజు చెల్లించనందుకు అతని నుంచి రూ.50 వేల పెనాల్టీ వసూలు చేశారని అధ్యయనం చేసి వచ్చిన గ్రేటర్ అధికారులు తెలిపారు. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది. చెత్త తరలింపు పర్యవేక్షణకు కన్సల్టెన్సీ.. ఇంటింటి నుంచి చెత్త తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకుగాను ఒక్కో ఇంటికి నెలకు రూ.11 వంతున కార్పొరేషన్ చెల్లిస్తోంది. అక్కడ సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి చెత్తడబ్బాలను తయారు చేశారు. తరిగి ఒక్కో డబ్బాను రూ.25లకు ప్రజలకు విక్రయించారు. టాయ్లెట్ల నిర్వహణ ఇలా.. ఒక్కో టాయ్‌లెట్ నిర్వహణకు ఇండోర్‌లో నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.7500 కేర్‌టేకర్‌కు చెల్లిస్తుండగా, రూ.7500 నిర్వహణకు వెచ్చిస్తున్నారు. అక్కడ ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేది 29 రోజులకే. ఆ ఒప్పందం ముగియగానే వారినే మళ్లీ తాజా ఒప్పందంతో తీసుకుంటారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్లు రాకుండా ఇండోర్‌లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గతేడాది స్వచ్ఛ ర్యాంకింగ్‌లో దేశంలోనే నెంబర్–1గా నిలిచిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చారు. వారు అధ్యయనం చేసిన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. అధ్యయనం చేసి వచ్చిన వారిలో జోనల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, హరిచందన, భారతి హొళికేరి, అడిషనల్ కమిషనర్ మనోహర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, శశికిరణాచారి తదితరులు ఉన్నారు. వారు తమ అధ్యయన నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నారు. వాటిలో నగరానికి అనువైన వాటిని త్వరలో అమలు చేయనున్నారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ.. ఇండోర్ కార్పొరేషన్ జనాభా 35 లక్షలు. విస్తీర్ణం 150 చ.కి.మీ. కమిషనర్‌తో పాటు నలుగురు అడిషనల్ కమిషనర్లు స్వచ్ఛ కార్యక్రమాలపైనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు. గతేడాది నెంబర్–1గా నిలవడంతో దాన్ని తిరిగి నిలుపుకుందామంటూ ఎక్కడ చూసినా ‘ఫిర్ రహేంగే’ ప్రకటనలు కనిపిస్తున్నాయని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
రైతులందించే ‘పర్యావరణ సేవల’ను గుర్తించలేమా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చిన్న, పెద్ద రైతులందరికీ ఎకరానికి ఏటా రెండు పంటలకు కలిపి రూ. 8 వేల ఆర్థిక తోడ్పాటును ప్రకటించింది. ముఖ్యంగా రసాయనిక ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంక్షోభంలో చిక్కుకున్న రైతులకు ప్రభుత్వ సహాయం చేయడం హర్షదాయకమైన విషయం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఎంతో విలువైన ప్రకృతి వనరులను అత్యంత పొదుపుగా వాడుకుంటూ చాలా మంది రైతులు సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పర్యావరణహితమైన మెరుగైన సేద్య పద్ధతుల ద్వారా ఈ రైతులు అందిస్తున్న ‘పర్యావరణ సేవల’ విలువను సైతం ప్రభుత్వం సముచిత రీతిన గుర్తించి, ప్రత్యేక బోనస్‌లు ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది. ముఖ్యంగా, మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 5 వేల మంది చిన్న, సన్నకారు దళిత మహిళా రైతులతో శాశ్వత ప్రయోజనాలనందించే సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరింపజేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఇటీవల గళమెత్తింది. సేంద్రియ చిరుధాన్యాలు సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించాలని డీడీఎస్ డైరెక్టర్ సతీష్, రైతులు సమ్మమ్మ, వినోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చిరుధాన్యాల సాగు పేద రైతు కుటుంబాల పాలిట ఆరోగ్యశ్రీ వంటిదని చెప్పారు. వ్యవసాయ సంక్షోభానికి అసలైన పరిష్కారం సేంద్రియ చిరుధాన్యాల సాగే సరైన మార్గమని చిన్న, సన్నకారు రైతుల 30 ఏళ్ల అనుభవాలు చాటి చెబుతున్నాయన్నారు. హరిత విప్లవ పితామహుడు డా. ఎమ్మెస్ స్వామినాథన్ కూడా రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని చెబుతుంటే.. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించడం సంక్షోభాన్ని మరింత పెంచుతుందన్నారు. ప్రజలందరికీ పోషక విలువలతో కూడిన సమతుల పౌష్టికాహారాన్ని అందించాలన్నా, అన్ని రకాలైన వాతావరణ మార్పులను తట్టుకోవాలన్నా.. ఒకటికి పది రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలను కలిపి ప్రతి పొలంలోనూ.. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. ఈ పద్ధతులను అనుసరించే రైతులు ప్రకృతి వనరులను పరిరక్షిస్తున్నందుకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్‌లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. నీటి పొదుపు బోనస్: చిరుధాన్యాలను సాగు చేసే రైతు ఎకరాకు ఆరు లక్షల గ్యాలన్ల సాగు నీటిని పొదుపు చేస్తున్నారు. అందుకని ఈ రైతులకు నీటి బోనస్‌ను ప్రకటించాలి. జీవవైవిధ్య పంటల బోనస్: తమ చిన్న కమతాలలోనే 20–40 రకాల పంటలను జీవవైవిధ్య సంరక్షణ పద్ధతులను అనుసరించి రైతులు పండిస్తున్నారు. ఇటువంటి రైతులకు ప్రత్యేకంగా బయోడైవర్సిటీ బోనస్ ఇవ్వాలి. పోషక విలువల బోనస్: దేశంలోని ప్రజలకు అత్యున్నతమైన పోషక విలువలున్న ఆహారాన్ని పండించి ఇవ్వడం ద్వారా.. వారిలోని పోషక లోపం తగ్గించి, వాతావరణ మార్పుల ప్రమాదం నుంచి కాపాడుతూ భవిష్యత్ తరాలకు సేంద్రియ చిరుధాన్య రైతులు ఆరోగ్యదానం చేస్తున్నారు. ఈ కారణంగా వీరికి పోషక విలువల బోనస్ ప్రకటించాలి. పర్యావరణ రక్షణ బోనస్: వాతావరణ అనుకూల పంటలను సాగు చేస్తున్న కారణంగా వారికి పర్యావరణ రక్షణ బోనస్ ప్రకటించాలి. రసాయన రహిత వ్యవసాయం ద్వారా ప్రకృతి వనరుల పరిరక్షణకు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు అందిస్తున్న పర్యావరణ సేవలను పాలకులు గుర్తెరిగి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వడం అత్యంత సమంజసం! ఈ దిశగా ఆలోచించడం తక్షణావశ్యకత!! – సాగుబడి డెస్క్