రైతులందించే ‘పర్యావరణ సేవల’ను గుర్తించలేమా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చిన్న, పెద్ద రైతులందరికీ ఎకరానికి ఏటా రెండు పంటలకు కలిపి రూ. 8 వేల ఆర్థిక తోడ్పాటును ప్రకటించింది. ముఖ్యంగా రసాయనిక ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంక్షోభంలో చిక్కుకున్న రైతులకు ప్రభుత్వ సహాయం చేయడం హర్షదాయకమైన విషయం. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఎంతో విలువైన ప్రకృతి వనరులను అత్యంత పొదుపుగా వాడుకుంటూ చాలా మంది రైతులు సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పర్యావరణహితమైన మెరుగైన సేద్య పద్ధతుల ద్వారా ఈ రైతులు అందిస్తున్న ‘పర్యావరణ సేవల’ విలువను సైతం ప్రభుత్వం సముచిత రీతిన గుర్తించి, ప్రత్యేక బోనస్‌లు ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటున్నది.
ముఖ్యంగా, మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 5 వేల మంది చిన్న, సన్నకారు దళిత మహిళా రైతులతో శాశ్వత ప్రయోజనాలనందించే సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరింపజేస్తున్న డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) ఇటీవల గళమెత్తింది. సేంద్రియ చిరుధాన్యాలు సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించాలని డీడీఎస్ డైరెక్టర్ సతీష్, రైతులు సమ్మమ్మ, వినోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చిరుధాన్యాల సాగు పేద రైతు కుటుంబాల పాలిట ఆరోగ్యశ్రీ వంటిదని చెప్పారు. వ్యవసాయ సంక్షోభానికి అసలైన పరిష్కారం సేంద్రియ చిరుధాన్యాల సాగే సరైన మార్గమని చిన్న, సన్నకారు రైతుల 30 ఏళ్ల అనుభవాలు చాటి చెబుతున్నాయన్నారు.
హరిత విప్లవ పితామహుడు డా. ఎమ్మెస్ స్వామినాథన్ కూడా రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని చెబుతుంటే.. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించడం సంక్షోభాన్ని మరింత పెంచుతుందన్నారు. ప్రజలందరికీ పోషక విలువలతో కూడిన సమతుల పౌష్టికాహారాన్ని అందించాలన్నా, అన్ని రకాలైన వాతావరణ మార్పులను తట్టుకోవాలన్నా.. ఒకటికి పది రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలను కలిపి ప్రతి పొలంలోనూ.. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. ఈ పద్ధతులను అనుసరించే రైతులు ప్రకృతి వనరులను పరిరక్షిస్తున్నందుకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్‌లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.
నీటి పొదుపు బోనస్: చిరుధాన్యాలను సాగు చేసే రైతు ఎకరాకు ఆరు లక్షల గ్యాలన్ల సాగు నీటిని పొదుపు చేస్తున్నారు. అందుకని ఈ రైతులకు నీటి బోనస్‌ను ప్రకటించాలి.
జీవవైవిధ్య పంటల బోనస్: తమ చిన్న కమతాలలోనే 20–40 రకాల పంటలను జీవవైవిధ్య సంరక్షణ పద్ధతులను అనుసరించి రైతులు పండిస్తున్నారు. ఇటువంటి రైతులకు ప్రత్యేకంగా బయోడైవర్సిటీ బోనస్ ఇవ్వాలి.
పోషక విలువల బోనస్: దేశంలోని ప్రజలకు అత్యున్నతమైన పోషక విలువలున్న ఆహారాన్ని పండించి ఇవ్వడం ద్వారా.. వారిలోని పోషక లోపం తగ్గించి, వాతావరణ మార్పుల ప్రమాదం నుంచి కాపాడుతూ భవిష్యత్ తరాలకు సేంద్రియ చిరుధాన్య రైతులు ఆరోగ్యదానం చేస్తున్నారు. ఈ కారణంగా వీరికి పోషక విలువల బోనస్ ప్రకటించాలి.
పర్యావరణ రక్షణ బోనస్: వాతావరణ అనుకూల పంటలను సాగు చేస్తున్న కారణంగా వారికి పర్యావరణ రక్షణ బోనస్ ప్రకటించాలి. రసాయన రహిత వ్యవసాయం ద్వారా ప్రకృతి వనరుల పరిరక్షణకు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు అందిస్తున్న పర్యావరణ సేవలను పాలకులు గుర్తెరిగి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వడం అత్యంత సమంజసం! ఈ దిశగా ఆలోచించడం తక్షణావశ్యకత!!
– సాగుబడి డెస్క్