ఎమ్మెల్యే ఇంటి వద్ద కవ్విస్తున్న టీడీపీ నాయకులు
సాక్షి, హిందూపురం: డంపింగ్ యార్డు తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు హిందూపురంలో ఉద్రిక్తతకు దారి తీసాయి. వివరాలు... పట్టణంలోని 21వ వార్డు మోత్కుపల్లి సమీపంలోని డంపింగ్ యార్డు సమస్యపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ సోమవారం రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రమోహన్ పోస్టు చేశాడు. దీనిపై 21వ వార్డు కౌన్సిలర్ మారుతీరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు గోపీకృష్ణ స్పందించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా∙మోత్కుపల్లి డంపింగ్ యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేలా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చర్యలు చేపట్టారని, త్వరలో యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు. 37 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ఏమి చేశారంటూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం పట్టించుకోలేదని కౌంటర్ వేశారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేత సవాల్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు స్వీకరించి మంగళవారం ఉదయం 11 గంటలకు చౌడేశ్వరీ కాలనీలోని బాలకృష్ణ ఇంటి వద్దకే వస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం 10.23 గంటలకు వేదిక మారుస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్ వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పంపారు. అప్పటికే వైఎస్సార్‌సీపీ నేత గోపీకృష్ణ, కౌన్సిలర్లు మారుతీరెడ్డి, శివ, తదితరులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు.
చదవండి: (అర్హతే ప్రామాణికం)
గత టీడీపీ హయాంలో హిందూపురంలో బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి చేశారో వచ్చి చెప్పాలంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక జై బాలయ్య అంటూ టీడీపీ నేతలు నినాదాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రతిగా వైఎస్సార్‌సీపీ నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
చదవండి: (నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని)
జనవరి నుంచి కొత్త డంపింగ్ యార్డుకు చెత్త
జనవరి నుంచి చిన్నగుడ్డంపల్లి వద్దకు డంపింగ్ యార్డును మార్చనున్నట్లు హిందూపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా మోత్కుపల్లి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ స్పందించి పర్యావరణ శాఖ నుంచి ఎన్‌ఓసీ తెప్పించి ఇవ్వడంతో 2022, జనవరి నుంచి చెత్తను కొత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని చర్యలూ పూర్తి అయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యార్డు చుట్టూ వందలాది మొక్కలు నాటిస్తున్నట్లుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment