పచ్చ నేతల ప్రలోభ పర్వం | Distribution of sarees started before code in Hindupuram | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల ప్రలోభ పర్వం

Published Sun, Feb 18 2024 5:12 AM | Last Updated on Sun, Feb 18 2024 6:17 AM

Distribution of sarees started before code in Hindupuram - Sakshi

హిందూపురం అర్బన్‌/చిలమత్తూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. స్థానిక నేతల ద్వారా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. క్లస్టర్, బూత్‌ లెవెల్‌ కన్వీనర్ల కనుసన్నల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే, చాలాచోట్ల ప్రజల నుంచి వారికి చుక్కెదురవుతోంది.  చిలమత్తూరు మండలంలోని అప్పనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేస్తుండగా... సుధాకర్‌ అనే రైతు వారికి చీవాట్లు పెట్టాడు.

‘ఏమి చేశారని మాకు చీరలు ఇచ్చేందుకు వస్తున్నారు? ఏదైనా మంచి చేసి అప్పుడు పంపిణీ చేయండి. ఎన్నికలు వస్తేనే చీరలు పంచుతారా?! ఇదొక్కటి చేస్తే ఓట్లు పడవు. మంచి చేసిన వారికే ప్రజలు ఓట్లు వేస్తారు. మీలాంటి వాళ్లకు కాదు’ అని ఆయన చురకలు అంటించారు. దీంతో వారు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. 

రాత్రికి రాత్రే పంపిణీ 
హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రాత్రిపూట చీరల పంపిణీ చేపడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే చీరలు పంచేందుకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే మొదలుపెట్టారు. ఈసారి మహిళా ఓట్లు పడవని నిర్ధారణకు వచ్చారో  ఏమో తెలియదు కానీ హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో క్లస్టర్, బూత్‌ కనీ్వనర్ల కనుసన్నల్లో మహిళా ఓటర్లకు చీరల పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 2,46,463 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 1,22,471 మంది ఉన్నారు. ఇందులో లక్ష మందికైనా చీరలు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటోతో ఉన్న బ్యాగులో చీరలు ఉంచి మహిళలకు అందిస్తున్నారు.  నాలుగు రోజులుగా ఈ పంపిణీ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే లేపాక్షి మండలంలోని తిలక్‌ నగర్, నాయనపల్లి, లేపాక్షి, కంచిసముద్రం, చోళసముద్రం, హిందూపురం రూరల్‌ మండలంలోని బేవనహళ్లి, చౌళూరు, మనేసముద్రం, చిలమత్తూరు మండలంలో సోమఘట్ట, చాగలేరు, కోడూరు, చిలమత్తూరు, దేమకేతేపల్లిలో పంపిణీ పూర్తి చేశారు. టేకులోడు, తుమ్మలకుంట, వీరాపురంలో రెండు రోజుల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఈసారి నందమూరివారి కంచుకోట బద్ధలవ్వడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన బాలకృష్ణ పీఏలు ఈ సమాచారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితులలో చీరలు పంపిణీ చేసి మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాఫలించవని ప్రజలు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement