
పుణేలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బస్సును ఢీకొన్న డంపర్, మరో వాహనం
సాక్షి, ముంబై: పుణేలో రహదారి రక్తమోడింది. దేహు-కాత్రజ్ రోడ్డు మలుపులోని వడ్‌గావ్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వడ్‌గావ్ బ్రిడ్జిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ డంపర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొన్నది.
ఈ ఘటనలో బస్సు కూడా మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో వెనకాల వస్తున్న మరో రెండు మోటర్‌సైకిళ్లు ప్రమాదంలో చిక్కుకుపోయాయి. ఘటన స్థలంలోనే నలుగురు మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
మృతులు సాతారా జిల్లా జావలీ గ్రామానికి చెందిన సుభాశ్ చౌదరి, బాలాజీ రాథోడ్, రవీంద్ర సావంత్, సారిక, రేవతి సావంత్, గైక్వాడ్ మహంబర్‌గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డంపర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన అనంతరం దేహు-కాత్రజ్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంబించిపోయింది.