కూసుమంచిలో చెరువు వద్ద పడవేసిన వ్యర్థాలు
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రంలో చెత్తా చెదారం, వ్యర్థాలు లేకుండా చేసేందుకు అధికారులు వినూత్నంగా చేపట్టాలనుకున్న సాలీడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు అటకెక్కింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా డస్ట్‌బిన్‌లు (చెత్త డబ్బాలను) ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసేందుకు వీలుగా అధికారులు ప్రాజెక్టును రూపొందించారు. 2015లో ప్రతిపాదించిన ఈప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం మండల కేంద్రంలో నెలకు టన్నుల కొద్ది చెత్తా, వ్యర్థాలు తయారవుతున్నాయి.
ఇళ్లలోని చెత్తతోపాటు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న బడ్డీకొట్లు, చికెన్ సెంటర్‌లు, పండ్లు తదితర దుకాణాల నుంచి చెత్త టన్నుల కొద్ది వస్తోంది. వీటిని నేలకొండపల్లి వెళ్లే రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో ఆరోడ్డు పై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సాలీడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఉంటే ఈ వ్యర్థాలతో ఎరువును తయారు చేయవచ్చు. పొడిచెత్తను వేరుచేసి విద్యుత్ ప్రాజెక్టుల్లో వినియోగించుకునేందుకు వీలుండేది. కాగా ఈప్రాజెక్టుకు నిధులు లేకపోవటంతో అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. అధికారులు, ప్రభుత్వం ఈప్రాజెక్టుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
పాలేరులోనూ అంతే...
పాలేరు గ్రామ పంచాయతీలో కూడా చెత్త, వ్యర్థాలను నివాసాల దగ్గర లోనే రోడ్డు పక్కన పడవేస్తున్నారు. గ్రామంలోని చర్చి సమీపంలో వ్యర్థాలను వేస్తున్నారు.
దీంతో అటుగా వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మురికి కూపంగా మారిన ఆప్రాంతలో నివాసస్థుల పరిస్థితి వర్ణణాతీతం. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని కోరుతున్నారు.
ప్రాజెక్టు కోసం కృషి చేస్తా
మండల కేంద్రంలో సాలీడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడి దాని అమలుకు కృషిచేస్తా. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి. పంచాయతీ తరుపున చర్యలు చేపడతాం.
– చెన్నా మోహన్, సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment