పాలేరు(ఖమ్మం జిల్లా): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీల వైఖరి గమనించి ఓటేయమని కేసీఆర్ విన్నవించారు.
‘కాంగ్రెస్ మోసం చేస్తే.. కేసీఆర్ శవయాత్రనా?.. తెలంగాణ జైత్రయాత్రనా? అనే తలంపుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు. కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయండి. పార్టీల వైఖరి గమనించి ఓటు వేయండి. సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి. బీఆర్‌ఎస్ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశాం. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ మోసం చేస్తే నేను దీక్ష చేపట్టాను. అలుపులేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం.
వ్యవసాయం స్థిరీకరణ జరిగేలా చర్యలు చేపట్టాం. రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్. రైతులకు గత ప్రభుత్వాలు ఎలాంటి మేలు చేయలేదు. దేశంలో అత్యధిక ధాన్యం పండించే రెండో రాష్ట్రం తెలంగాణ. 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారు. 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ చాలని అంటున్నారు. రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు నిలిచిపోతాయి.
పాలేరు ప్రజలకు ఉపేందర్‌రెడ్డి ఉండటం అదృష్టం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చాం. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాం. అన్ని అవకాశాలు ఇచ్చినా తుమ్మల నిలబెట్టుకోలేకపోయాడు. తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు. ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడు. ఇక్కడ ప్రజలు ఒకటి గమనించాలి. తుమ్మలకు బీఆర్‌ఎస్ పార్టీ అన్యాయం చేసిందా?, బీఆర్‌ఎస్‌కు తుమ్మల అన్యాయం చేశాడా? అనేది గమనించాలి.
పాలేరులో ఉపేందర్‌రెడ్డిని గెలిపించండి. నేను ఒకే ఒక్క మాట చెబుతున్నా. దళితబంధు, రైతు బంధు కొనసాగిస్తాం.ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తాం. రేషన్‌కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తాం. 3 కోట్ల టన్నులు వరిధాన్యం పండించే తెలంగాణలో రేషన్‌కార్డు దారలందరికీ సన్నబియ్యమే పంపిణీ చేస్తాం. వచ్చే మార్చి నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment