► దుమ్ము..ధూళి.. దుర్వాసనకు తోడు...
► పదిరోజులుగా మండుతున్న డంపింగ్‌యార్డు
► తరలించాల్సిందేనని పట్టుబడుతున్న స్థానికులు
► పదకొండు నెలలైనా అమలుకు నోచుకోని సీఎం కేసీఆర్ హామీ
ఖమ్మం: నగరంలోని దానవాయిగూడేన్ని డంపింగ్ యార్డు సమస్య వేధిస్తోంది. పది రోజులుగా అక్కడ మంటలు వస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు పొగ, దుమ్మూధూళితోపాటు మంటలు ఎక్కువవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. తాము రోజూ ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దానవాయిగూడెంలోని జనావాసాల మధ్యనే డంపింగ్ యార్డు ఉంది. నగరంలో ప్రతి రోజు 50 డివిజన్లలో 2.5 మెట్రిక్ టన్నుల చెత్తా చెదారం వెలువడుతుంది.
చెత్తను డంపింగ్ చేసేందుకు దానవాయిగూడెంలో ప్రభుత్వం 38 ఎకరాల భూమి కేటాయించింది. ఈ స్థలం మొత్తం జనావాసాలకు సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 1200 నివాసగృహాలుండగా, ఏడు వేల మంది దాకా ప్రజలు నివస్తున్నారు. 2010 నుంచి నగరంలో సేకరించిన చెత్తాచెదారం ఈ ప్రాంతంలోనే వేస్తున్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పట్నుంచి పేరుకుపోతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్‌యార్డులోకి పందులు, గేదెలు కూడా వచ్చి చెత్తను కదిలిస్తుండటంతో దుర్వాసన మరింత ఎక్కువగా వస్తోంది. దీంతో అక్కడివారు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంటోంది.
కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఖమ్మం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి దానవాయిగూడెంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు. ఇది జనావాసాలకు దగ్గరగా ఉందని, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే 11 నెలలు కావొస్తున్నా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంటలతో మరింత కష్టం. అసలే దుర్వాసనను భరించలేక పోతున్న స్థానికులకు మరో కష్టం వచ్చి పడింది.
పది రోజులుగా ఈ డంపింగ్‌యార్డులో మంటలు రాజుకున్నాయి. ఇవి ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. ఈ మంటలను ఆర్పేందుకు అటు ఫైర్ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు జేసీబీలు ఏర్పాటు చేసినా మంటలు అదుపులోకి రావడం లేదు. పొగ నాలుగు డివిజన్లకు వ్యాపించడంతో ఆయా డివిజన్ వాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. నగరంలోని 35, 49, 50, ఒకటో డివిజన్లకు పొగ వ్యాపిస్తోంది. రాత్రి,పగలు తేడా లేకుండా పొగ వెలువడుతోంది. ఈ పొగను పీల్చడం వల్ల అనారోగ్యానికి గురవుతామని ఆందోళనకు గురవుతున్నారు.
డంపింగ్‌యార్డ్ తరలించాల్సిందే: మంటలు అదుపులోకి రాకపోవడంతో రెండు రోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగారు. డంపింగ్‌యార్డ్‌ను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను నిర్బంధించి సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలేది లేదని భీష్మించారు. పొగ, దుర్వాసన, దుమ్మూధూళితో తాము ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ కలెక్టర్‌కు ఫోన్ చేసి.. కలెక్టర్ ఇచ్చిన హామీతో అధికారులను వదిలిపెట్టారు. అయితే ఈ డంపింగ్‌యార్డులో మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో.. ఇక్కడి నుంచి ఎప్పుడు తరలిస్తారోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు.
పొగతో ఇబ్బందులు పడుతున్నాం: డంపింగ్‌యార్డులో మంటలు ఆరకపోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. రోజూ పొగ ఇళ్లను కమ్మేస్తోంది. దీనివల్ల ఈ పొగను పీల్చాల్సి వస్తోంది. మాకు అనారోగ్యం వస్తుందేమోనని భయంగా ఉంది. అధికారులు మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చేలా చూడాలి: భూక్యా రామదాసు
డంపింగ్‌యార్డును తరలించాలి: నివాసాల మధ్యలో ఉన్న డంపింగ్‌యార్డును ఇక్కడి నుంచి తరలించాలి. మా ఇళ్ల మధ్యలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోంది. ఈవాసన భరించలేకపోతున్నాం. గతంలో సీఎం వచ్చినప్పుడు డంపింగ్‌యార్డును తరలించాలని అధికారులకు సూచించినా.. చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు ఇప్పుడు మంటలు రావడంతో పొగతో అందరం ఇబ్బంది పడుతున్నాం. :రమణ