తొలి రోజు 6 | first day 6 nominations | Sakshi
Sakshi News home page

తొలి రోజు 6

Published Tue, Mar 11 2014 4:35 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

first day 6 nominations

 మునిసిపల్ ఎన్నికల నామినేషన్లు షురూ
 ఇల్లెందులో మూడు, సత్తుపల్లిలో రెండు, కొత్తగూడెంలో ఒకటి దాఖలు
  మధిర నగర పంచాయతీలో బోణీ లేదు
  12న ముహూర్తం పెట్టుకున్న అభ్యర్థులు!
 పబ్లిక్ నోటీస్ విడుదల
 
 సాక్షి, ఖమ్మం:
 మునిసిపల్ నామినేన్లకు తొలిరోజు స్పందన కరువైంది. పొత్తులు ఖరారుకాకపోవడం, పన్ను బకాయిల చెల్లింపు పూర్తికాకపోవడం తదితర కారణాలతో పలువురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు వెనుకాడారు. సోమవారం నుంచి మొదలైన నామినేషన్ల ఘట్టం 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఈలోగా పన్నుల చెల్లింపు, పొత్తులు ఖరారవుతాయనే ఆశాభావంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.
 
 నాలుగుచోట్ల ఆరు దాఖలు..
 జిల్లాలో ఎన్నికలు జరిగే నాలుగు మునిసిపాలిటీల్లో కలిపి తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా ఇల్లెందులో మూడు నామినేషన్లు వేశారు. ఈ మూడు కూడా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నుంచే దాఖలయ్యాయి. సత్తుపల్లిలో రెండు, కొత్తగూడెంలో ఒక నామినేషన్ దాఖలు అయింది. మధిరలో ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇల్లెందులో 1, 7, 11 వార్డుకు అభ్యర్థులు నామినేషన్ వేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 1వ వార్డుకు టీడీపీ అభ్యర్థి కొదురుపాక రాజేంద్రప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. సత్తుపల్లి నగరపంచాయతీలో 20 వార్డులకు గాను 9, 10 వార్డులకు టీడీపీ అభ్యర్థులు కందిమళ్ల నాగేశ్వరమ్మ, షేక్ అబ్దుల్ఫ్రీ నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీలో 20 వార్డులుండగా ఒక వార్డుకు కూడా నామినేషన్ దాఖలు కాలేదు.
 
 పొత్తులు తేలక హైరానా..
 ప్రధాన ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనేపథ్యంలో తొలి విడతగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై స్థానికంగా ఇంకా పొత్తులు కొలిక్కిరాలేదు. పార్టీల తరఫున బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు పొత్తులతో తమకు అవకాశం వస్తుందో లేదోనని హైరానా పడుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పొత్తుల విషయమై అధికారికంగా ఏపార్టీ ప్రకటన చేయలేదు. అన్ని పార్టీల నేతలు చర్చలతోనే సరిపెడుతుండటం, ఏపార్టీ తమ అభ్యర్థులు వీరే అని ప్రకటించని పరిస్థితి నెలకొంది. నామినేషన్లకు ఇంకా నాలుగు రోజులే ఉండటం..బుధవారం మంచి ముహూర్తం ఉండటంతో ఈలోగా పొత్తులు ఖరారు కావాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు. అవసరమైతే కొందరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరణ నాటికి పార్టీ అభ్యర్థిగా ముద్రవేయించుకోవాలని కూడా భావిస్తున్నారు. మరికొందరు పార్టీ అభ్యర్థిగా నిర్ధారణ అయ్యాకే మందీమార్బలంతో వచ్చి నామినేషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నారు.
 
 బరికి బకాయిల గోల..
 మునిసిపల్ బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు బకాయిల గోల పట్టుకుంది. అభ్యర్థిగా పోటీ చేయాలంటే తప్పని సరిగా ఇంటి, నీటి పన్ను బకాయిలు చెల్లించాల్సిందే. గతంలో బరిలో నిలిచిన అభ్యర్థులు రూ.వేలల్లో పన్నులు చెల్లించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుటున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. పార్టీల తరఫున పోటీలో ఉండాలనుకుంటున్న అభ్యర్థులు రూ.వేలల్లో మున్సిపాలిటీలు, నగరక పంచాయతీలుకు బకాయిలు ఉన్నారు. తమకున్న పలుకుబడితో పన్నులు చెల్లించకుండా నెట్టుకొచ్చారు.
 
 ప్రస్తుతం ఎన్నికల నిబంధన వారికి కొరకరాని కొయ్యగా మారింది. బకాయిలు చెల్లించిన వారే బరిలో నిలవాలని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉంది. సందుట్లో సడేమియా లాగా సంబంధిత అధికారులు పన్నుల వసూళ్లకే ప్రత్యేకంగా నామినేషన్ కేంద్రాల్లో కౌంటర్లు తెరిచారు. ఇల్లెందు, కొత్తగూడెం మునిసిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో ఈవిధంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. బకాయిల గోలతో కొంత మంది పోటీకి వెనక్కు తగ్గుతుంటే మరికొంత మంది గెలవడమే ధ్యేయంగా పన్ను చెల్లించడానికి ముందుకొస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement