పాల్వంచలో అభివృద్ధి పనుల అమలుపై మొట్టికాయ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాల్వంచ మున్సిపాలిటీతోపాటు జిల్లాలోని పలు శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2015 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను చేసిన ఆర్థిక వ్యయాలకు సంబంధించిన మదింపు నివేదికను తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ప్రత్యేకంగా పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధించి మురికివాడలను గుర్తించడంలో సరైన కారణాలు చూపలేదని అక్షింతలు వేసింది. అలాగే పంచాయతీరాజ్‌లో కొన్ని చోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇవ్వలేదని, మరికొన్ని చోట్ల కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఖర్చు కాకుండా మిగిలిన వాటిని మళ్లీ కేంద్రానికి జమచేయలేదని ఎత్తి చూపింది. జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలు, స్థానిక సంస్థల ఆడిట్‌లో కాగ్ ప్రస్తావించిన అంశాలివి...
సమీకృత గృహ, మురికివాడల అభివృద్ధి కార్యక్రమం (ఐహెచ్‌ఎఫ్‌డీసీ) డిసెంబర్ లో ప్రవేశపెట్టిన నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణపథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)లో ఒక అంశంగా చేర్చారు. ఎంపిక చేసిన నగరాలలో సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన సత్వర అభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అయితే పాల్వంచలో స్థలాలు లభించకపోవడం వల్ల సామాజిక వినియోగకేంద్రాలు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. అలాగే పాల్వంచలో 17 మురికివాడలను అభివృద్ధి చేసేందుకు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ మురికివాడలను ఎంపిక చేసేందుకు తీసుకున్న ప్రామాణికాలు ఏమిటో తెలపలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మురికివాడలను ఎంపిక చేశారని ఆడిట్ నిర్ధారణకు రాలేదు.
పాల్వంచలో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్న మురికివాడలను ఎంపిక చేసి.. దాని అభివృద్ధికి నిధులు ఖర్చు చేయడంపై ఆడిట్ అభ్యంతరం తెలిపింది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయకపోవడాన్ని ఆడిట్‌లో తప్పుపట్టారు. అలాగే కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధుల్లో మిగులు, వడ్డీని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే పాల్వంచ మున్సిపాలిటీ రూ.1.40 కోట్లు తిరిగి చెల్లించలేదని ఆడిట్ నివేదికలో పేర్కొంది.
మురికవాడలను గుర్తించేందుకు ప్రామాణికంగా చేసుకున్న అంశాలను ఖమ్మం కార్పొరేషన్ అందజేసిన నివేదికలో పొందుపరచలేదని పేర్కొంది. వివిధ రకాల గ్రాంట్లకు సంబంధించి పంచాయతీ రాజ్ సంస్థల్లో 2015 మార్చి నాటికి వినియోగ ధ్రువపత్రాలను జెడ్పీ సీఈఓ సమర్పించలేదని నివేదికలో కాగ్ పేర్కొంది.సెర్ప్‌కు సంబంధించి పరిహార రుసుము, వడ్డీ కలుపుకుని రూ.23,25,486లను చెల్లించాలని 2014 మేలో నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంత వరకు చెల్లించలేదు.
ఆడిట్ నిర్వహించిన ఐదు సర్కిళ్లలోని మొత్తం 5057 కేసులలోని వ్యాట్ డీలర్లు (సదరు ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల కన్నా ఎక్కువ టర్నోవర్ కలిగిన వారు) 2011-14 సంవత్సరానికి ఆడిటర్లు ధ్రువీకరించిన ఆర్థిక వివరణ పట్టికలను సమర్పించలేదని కాగ్ నిర్ధారణకు వచ్చింది. ఇందులో కొత్తగూడెం కూడా ఉంది.
2014 సెప్టెంబర్‌నుంచి 2015 ఫిబ్రవరి మధ్య 68 మంది డీలర్లు ఒక రోజు నుంచి 487 రోజుల ఆలస్యంతో పన్నులు చెల్లించినప్పటికీ అసెసింగ్ అధికారులు వడ్డీ, ఫెనాల్టీ విధించలేదు. ఇందులో జిల్లాకు సంబంధించిన డీలర్లు కొంతమంది ఉన్నారు.
ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో తాటి, ఈతచెట్ల అద్దెలను గ్రామీణ ప్రాంతాలకు వర్తింపచేయు రేట్ల ప్రకారం వసూలు చేసినట్లు ఆడిట్ గమనించింది. 41 కేసులకు గాను 40 కేసులలో పట్టణ జనాభా లెక్కల ప్రకారం అద్దెలను వసూలు చేయాల్సి ఉందని ఆడిట్‌లో గుర్తించారు. ఇందులో ఖమ్మం జిల్లా కూడా ఉంది.
తెలంగాణ మోటారు వాహనాల పన్ను విధాన చట్టం ప్రకారం... ప్రతి మోటారు వాహన యజమాని ప్రభుత్వ నిర్దేశించిన రేట్లననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో రూ.4.23 కోట్ల మేర త్రైమాసిక పన్నును 2,644 మంది రవాణా వాహన యజమానులు చెల్లించడం కానీ, రవాణా శాఖ ఆమేరకు డిమాండ్ పంపించడం కానీ జరగలేదని ఆడిట్‌లో గమనించారు. ఇందులో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌తోపాటు ఖమ్మం కూడా ఉంది.
కడిగేసిన కాగ్
Published Thu, Mar 31 2016 12:17 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement