- తొలుత కరీంనగర్ రీచ్ నుంచి..
- టెండర్లను తెరిచిన ఎండీసీ
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతోపాటు, చవక ధరల్లో ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బహిరంగ మార్కెట్‌లో ఈ నెల 16 నుంచి ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. ఈ మేరకు ఇప్పటికే గుర్తించిన రీచ్‌ల నుంచి డంపింగ్ యార్డుకు ఇసుకను చేరవేసే కాంట్రాక్టు కోసం అధికారులు టెండర్లను పిలిచారు.
కరీంనగర్ రీచ్‌లకు సంబంధించిన టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే ప్రక్రియను శనివారం టీఎస్‌ఎండీసీ అధికారులు ప్రారంభించారు. రీచ్‌ల నుంచి ఇసుకను తరలించి, ప్రజలకు అందుబాటులోకి తేవడం వంటి కార్యక్రమాలను ఈ నెల 15లోగా పూర్తి చేసి 16 నుంచి అమ్మకాలు సాగించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఎండీసీ ఎండీ లోకేష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి
ఇసుకపై గత ప్రభుత్వాలు సరైన విధానాన్ని అవలంభించక పోవడంతో రీచ్‌లన్నీ ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లాయి. డిమాండ్‌ను బట్టి ఇప్పటి వరకు అక్రమంగా టన్ను ఇసుకను వెయ్యి నుంచి 2 వేల రూపాయల వరకు విక్రయించేవారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించింది. గోదావరి, దాని ఉప నదులు, కృష్ణా నది, ఇతర వాగుల్లో లభించే మేలైన ఇసుకను సరైన పద్ధతిలో విక్రయిస్తే ప్రజలకు మేలు కలుగుతుందని ప్రభుత్వం భావించింది.
ఇందులో భాగంగా టీఎస్‌ఎండీసీకి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ముందుగా కరీంనగర్ జిల్లాలో గుర్తించిన 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్‌లకు టెండర్లను పిలిచారు. కాంట్రాక్టర్లను సోమవారం నాటికి ఖరారు చేస్తారు. అలాగే కరీంనగర్, నల్గొండలోని మరో రెండు రీచ్‌లలో ఫిబ్రవరి 25 నుంచి ఇసుక అమ్మకాలు సాగిస్తారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో గుర్తించిన మూడు రీచ్‌లలో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను మార్చి 10 నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఇసుక టన్నుకు రూ. 400 నుంచి గరిష్టంగా రూ. 1100 వరకు విక్రయించాలని టీఎస్‌ఎండీసీ నిర్ణయించింది.