jindal company
-
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
కొండవీడులో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్
-
వ్యర్థాలే ‘పవర్’ ఫుల్!
సాక్షి, అమరావతి: వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి రంగం సిద్ధమైంది. డంపింగ్ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడుపేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కర్మగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకూ ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో విద్యుదుత్పత్తి జరిగే విధానంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.. ఇలా ఉత్పత్తి.. రోజుకు 1,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి–మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. లారీల్లో వచ్చే చెత్తను కర్మాగారంలోని పిట్లో అన్లోడ్ చేస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్‌ను నిర్మించారు. పిట్లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్ క్రేన్ సాయంతో ఫీడర్లో వేస్తారు. ఫీడర్ కింద అమర్చిన సోటకర్ నుంచి వెలువడే మంటలో వ్యర్థాలను మండిస్తారు. ఇవి మండినప్పుడు వచ్చే వేడికి బ్రాయిలర్‌లో స్టీమ్ వెలువడుతుంది. ఈ స్టీమ్.. టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 మెగా వాట్ల టర్బైన్ను అమర్చారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వెంగళాయపాలెంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్ లైన్‌ను వేశారు. కర్మాగారంలో 11/33 కేవీ స్విచ్ యార్డు నెలకొల్పారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కమ్‌లకు యూనిట్‌కు రూ.6.16కు విక్రయిస్తారు. వ్యర్థాలు మండినప్పుడు బాటమ్ యాష్, ఫ్లైయాష్ అనే రెండు రకాలైన బూడిద వెలువడుతుంది. ఫ్లైయాష్‌ను నిర్మాణాలకు వాడే ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బాటమ్ యాష్‌ను లోతట్టు ప్రాంతాల్లో పూడిక కోసం వినియోగించవచ్చు. ఇదే తరహాలో విశాఖలోనూ.. గుంటూరు తరహాలోనే విశాఖపట్నంలో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణంలో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్ సంస్థకు అనుమతులు లభించినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు వేగంగా జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటుతో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ కర్మాగారాలు దేశంలో ఇప్పటికే ఐదు ఉన్నాయి. ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో ఉన్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి. త్వరలోనే విద్యుదుత్పత్తి ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైంది. కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ) కోసం ఏపీసీపీడీసీఎల్‌కు దరఖాస్తు చేశాం. సీవోడీ మంజూరైతే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తాం. త్వరలోనే కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. – ఎంవీ చారి, జిందాల్ ఏపీ ప్రాజెక్ట్‌ల ప్రెసిడెంట్ -
ఇండియాలో అత్యంత సంపన్న మహిళగా రికార్డు
Savitri Jindal - Top Richest Women In India: పురాణాల్లో సావిత్రి అంటే భర్తే లోకంగా బతికే ఓ మహిళ. భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ సావిత్రి ఏకంగా యముడితోనే పోరాటం చేసి విజయం సాధించింది. కానీ ఈ సావిత్రి భర్త ప్రాణాలతో సమానమైన అతని ఆశయాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాదు దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన జిందాల్ గ్రూపుకి చుక్కానిలా మారింది. 14 లక్షల కోట్లకు పైగా సంపదతో దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా రికార్డులెక్కింది. ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ధనవంతులైన మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ రూ. 13.46 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఏడాది ఆమె సంపద విలువ 9.72 లక్షల కోట్లు. ఏడాదిలో తన కంపెనీ విలువని 3.34 లక్షల కోట్ల మేరకు పెంచగలిగారు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థంగా నిర్వ్వహిస్తున్న సావిత్రీ ఏ బిజినెస్ స్కూల్లోనూ చదువుకోలేదు. ఆ మాటకొస్తే పెద్దగా కాలేజీకి వెళ్లింది కూడా లేదు. తొమ్మిది మంది పిల్లల తల్లిగా యాభై ఏళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. ఒక్కసారిగా 55 ఏళ్ల వయస్సులో కార్పొరేట్ వరల్డ్‌లోకి అడుగు పెట్టారు. ఎవ్వరూ ఊహించలేని విజయాలను సాధించారు. ఇంతకీ ఎవరీ సావిత్రి. ఆమె వెనుక ఉన్న విజయ రహస్యం ఏంటీ ? మహిళ వెనుక పురుషుడు ప్రతీ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఈ మహిళ సాధించిన విజయాల వెనుక ఓ పురుషుడు ఉన్నాడు. సావిత్రి విజయపరంపరకు వేదికను నిర్మించింది ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్. అంటే జిందాల్ గ్రూపు వ్యవస్థాపకుడు. ఓం ప్రకాశ్ జిందాల్‌కి చిన్నతనం నుంచి మెషిన్లంటే వల్ల మానిన అభిమానం. ఏ పరికరం కనిపించినా దాని భాగాలు పరిశీలిస్తూనే ఉండేవారు. అలా ఓ సారి ఓ పైపుపై మేడ్ ఇన్ ఇంగ్లండ్ అనే అక్షరాలు కనిపించాయి. మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో కనీసం పైపులయినా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ తపనతోనే ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేకుండానే కేవలం తనకున్న అనుభవంతోనే 22 ఏళ్ల వయస్సులో బకెట్ల తయారీ పరిశ్రమ ఓం ప్రకాశ్ జిందాల్ స్థాపించారు. పన్నెండేళ్ల పాటు బకెట్లు తయారు చేస్తూ.. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిగా మార్చి 1962లో కోల్‌కతా దగ్గర పైపుల పరిశ్రమను స్థాపించారు. అది క్లిక్ కావడంతో 1969లో అక్కడే జిందాల్ స్ట్రిప్‌ని నెలకొల్పారు. అప్పుడే సావిత్రి ఆయన జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. స్టీల్, పవర్, మైనింగ్, గ్యాస్, ఆయిల్ సెక్టార్లలో జిందాల్ గ్రూప్‌ని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు. ఆ తర్వాత రాజకీయాలవైపు మళ్లి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. హరియాణాలోని హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పరిశ్రమల మంత్రిగా పని చేశారు. పిల్లల బాగోగులు చూసుకుంటూనే భర్తలోని కార్యదక్షతను దగ్గరగా గమనించారు సావిత్రి. అదే అమెకు బలమయ్యింది. మూన్నాళ్ల ముచ్చటే తొమ్మిది సంతానంతో ఇంటి పనులకే పరిమితమైన సావిత్రి స్టీలు, పవర్ సెక్టార్లో ఉన్న జిందాల్ గ్రూపుని సమర్థంగా నిర్వహించలేదనే విమర్శలు వచ్చాయి. కేవలం ఆయన భార్యగా ఆ హోదాలో కొన్నాళ్ల పాటే ఆమె చైర్ పర్సన్‌గా ఉంటారని, తర్వాత స్థానం తమదే అనుకున్న జిందాల్ బోర్డు గ్రూపు సభ్యులు.. వందతులు వ్యాపింప చేశారు. ఓం ప్రకాశ్‌తోనే జిందాల్ గ్రూపు ప్రభ పోతుందని ఇకపై మార్కెట్లో ఆ గ్రూపు కనిపించదని ప్రత్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓం ప్రకాశ్ జిందాల్‌ని దగ్గర నుంచి గమనించిన సావిత్రికి భర్త ఆశయాలు బాగా తెలుసు. అంచనాలు తారుమారు ఇండస్ట్రియల్ సెక్టార్లో మిషన్ మ్యాన్‌గా ఓం ప్రకాశ్ జిందాల్‌కి పేరుంది. ఎవరికీ కనిపించని అవకాశాలను వెతికి పట్టుకుంటారని పేరు. అచ్చంగా దాన్ని ఆచరణలో చూపించారు సావిత్రి. వంటింట్లో ఉన్న మహిళ కార్పొరేట్ ఎత్తులను తట్టుకోలేదని, కూలబడిపోతుందని వేసిన అంచనాలను ఆమె తప్పని నిరూపించారు. తను కంపెనీ చైర్‌పర్సన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిందాల్ గ్రూప్ సంపదను నాలుగింతలు పెంచి విమర్శకుల చేత ఔరా అనిపించారు. భర్త అడుగు జాడల్లో నడుస్తూ హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెవెన్యూ మంత్రిగా కూడా సేవలు అందించారు. స్టీల్, పవర్‌తో పాటు మైనింగ్, గ్యాస్, ఆయిల్ సెక్టార్లలోకి వ్యాపారాన్ని విస్తరింప చేశారు. సంపన్న మహిళ భర్త చాటు భార్యగా తొమ్మిది మంది పిల్లలకు తల్లిగా పెద్దగా ఎప్పుడూ గడప దాటని ఈ మహిళ ఈ రోజు పురుషాధిక్య ప్రపంచంలో తనదైన వెలుగులు విరజిమ్ముతోంది. ఫలితంగా ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ధనవంతుల జాబితాలో ఇండియాలోనే అత్యధిక సంపన్నురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. 71 ఏళ్ల వయస్సులోనూ జిందాల్ గ్రూపుని సావిత్రి సమర్థంగా నిర్వహిస్తున్నారు. -
వ్యర్థానికి అర్థం.. పర్యావరణ హితం
సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి హానిలేకుండా ఉండేలా.. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు గుంటూరు జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. నెలరోజుల్లో ఈ ప్లాంటును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1,200 టన్నుల చెత్తను (నగరాలు, పట్టణాల్లో సేకరించే వ్యర్థాలను) ఉపయోగించి 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు, విశాఖపట్నంలలో రోజుకు 1,200 టన్నుల చెత్త సామర్థ్యం గల ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నాయుడుపేటలో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ డంప్ యార్డు కోసం 51.24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీన్లో 15.50 ఎకరాల్లో రూ.340 కోట్లతో ఈ ప్లాంటు నిర్మిస్తున్నారు. 600 టన్నుల చెత్తను మండించే సామర్థ్యంగల రెండు బాయిలర్లు (మొత్తం 1,200 టన్నులు) ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 1,650 టన్నులకు విస్తరించే అవకాశం ఉంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు కోసం 10 శాతం మార్కెట్ విలువతో భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇచ్చారు. నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు, బయో కెమికల్ వ్యర్థాలు కలవకుండా చెత్తను వేరుచేసి ఉచితంగా ప్లాంటుకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్లాంటుకు మూడు నగరాలు, ఐదు మునిసిపాలిటీల నుంచి చెత్తను సరఫరా చేయనున్నారు. చెత్త నుంచి వచ్చే విద్యుత్తుకు ఒక యూనిట్‌కు రూ.6 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అధునాతన యూరప్ సాంకేతికతతో చెత్తను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మండించేటప్పుడు వచ్చే పొగతో పర్యావరణానికి హానిలేకుండా ట్రీట్ చేస్తారు. 25 సంవత్సరాల తరువాత ఈ ప్లాంటును గుంటూరు నగరపాలక సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 70 మందికి, పరోక్షంగా 60 మందికి ఉపాధి కలుగుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు ఈ ప్లాంటు నిర్మాణంతో పర్యావరణానికి ఎంతో మేలు కలగనుంది. ఒక టన్ను చెత్త నుంచి 2,250 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనికంటే 23 రెట్లు హానికలిగించే మిథేన్ 150 కిలోలు ఉత్పత్తి అవుతుంది. వీటితోపాటు లీచెడ్ ద్రావణం 50 లీటర్లు వస్తుంది. ఈ ద్రావణం భూమిలో ఇంకితే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతోపాటు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఈ ప్లాంటు నిర్మాణంతో ఈ సమస్యలు ఎదురవకుండా ఉంటాయి. ఈ ప్లాంటులో భాగంగా వెంగళాయపాలెం వద్ద నిర్మిస్తున్న విద్యుత్తు సబ్‌స్టేషన్ పనులు పూర్తికావాల్సి ఉంది. వెంగళాయపాలెం నుంచి ప్లాంటుకు నీటిని తరలించే పైపులైను పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. కొందరు కార్మికులు కరోనా బారినపడ్డారు. ప్రారంభించేందుకు సన్నాహాలు ప్లాంటు నిర్మాణ పనులు పూర్తికావడంతో ఒక బాయిలర్ ద్వారా 15 రోజులు ట్రయల్ రన్ నిర్వహించారు. చెత్తను 15 రోజుల పాటు గుంటూరు కార్పొరేషన్ నుంచి ప్లాంటుకు పంపాం. కోవిడ్ నుంచి ఉపశమనం కలుగగానే ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఈ ప్లాంటు పూర్తయితే గుంటూరుతో పాటు చుట్టుపక్కల నగరాలు, పట్టణాలకు ఉపయోగం. ప్రధానంగా పర్యావరణానికి మేలు కలుగుతుంది. – చల్లా అనురాధ,నగర కమిషనర్, గుంటూరు ప్లాంటు పనులు పూర్తయ్యాయి.. ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వాటర్ పైపులైను, సబ్‌స్టేషన్ పనులు కొద్దిగా పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం లభిస్తోంది. పలువురు కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పరిస్థితులు అనుకూలిస్తే నెలరోజుల్లోపు ప్లాంటును ప్రారంభిస్తాం. ఈ ప్లాంటు ప్రారంభమైతే పర్యావరణానికి హానికలగకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. – ఎంవీ చారి, ప్రెసిడెంట్, ఏపీ ప్రాజెక్ట్స్ -
కిల్తంపాలెం వద్ద జిందాల్ పవర్ ప్లాంట్?
శృంగవరపుకోట రూరల్: జిందాల్ సౌత్ వెస్ట్ ఎనర్జీ లిమిటెడ్ (జేఎస్‌డబ్ల్యూ) ఆధ్వర్యంలో ఎస్.కోట మండలం కిల్తంపాలెం పరిసర ప్రాంతాల్లో రూ. 2 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని కిల్తంపాలెం సమీపంలోని జిందాల్ కంపెనీ భూములను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ జనరల్ మేనేజర్ తపస్, డైరెక్టర్, హెడ్ ప్రాజెక్ట్ రాచూరి కనకారావు, మేనేజర్ విశాల్ సోని, కన్సల్టెంట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చీడిపాలెం, కిల్తంపాలెం, పెదఖండేపల్లి పరిసర గ్రామాల్లో జిందాల్ కంపెనీకి ఉన్న 650 ఎకరాల్లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన, బొడ్డవర వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సోలార్ పవర్ అనుసంధానం తదితర సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిందాల్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటయితే ఈ ప్రాంతంలోని సుమారు 600 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇక జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోనే మరో 60 ఎకరాల్లో పెయింట్ పరిశ్రమ, బొడ్డవర సమీపంలోని అమ్మపాలెం వద్ద 300 ఎకరాల్లో బ్రాండెక్స్ తరహా టెక్స్టైల్ పార్క్ వంటి పరిశ్రమను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాగా, జేఎస్‌డబ్ల్యూ అల్యుమినా లిమిటెడ్ పేరుతో ఈ ప్రాంతంలో సుమారు 1,165 ఎకరాల భూములు ఉన్నాయని, ఆ భూములను కంపెనీ వినియోగంలోకి తెచ్చే విధంగా ఆలోచనలు సాగిస్తున్నట్లు డైరెక్టర్, హెడ్ ప్రాజెక్ట్ రాచూరి కనకారావు వివరించారు. -
వేస్ట్ టు ఎనర్జీ వైపు అడుగులు
– చంద్రగిరిలో 16.22 ఎకరాలు అప్పగింత – రిజల్యూషన్ కోసం కౌన్సిల్‌కు పంపిన కార్పొరేషన్ – ప్లాంట్ ఏర్పాటుకు వీడనున్న గ్రహణం తిరుపతి తుడా: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్(వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ) ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు బుధవారం చంద్రగిరి గ్రామ పరిధిలో 16.22 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు కార్పొరేషన్‌కు అప్పగించారు. గురువారం కౌన్సిల్ అనుమతులు కోసం రిజల్యూషన్ దస్త్రాలను పంపారు. ప్రత్యేక అనుమతులు వచ్చిన వెంటనే జిందాల్ కంపెనీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను నిర్మాణ పనులను చేపట్టనుంది. వ్యర్థాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్లాంట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత రామచంద్రాపురం మండలం రామాపురం వద్ద, చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ పరిధిలో స్థలపరిశీలన చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు ఇవేవీ అనుకూలంగా లేకపోవడంతో 8 నెలలుగా పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించారు. భారీ యంత్రాల ఏర్పాటుకు అనువుగా ఉండడంతో జిందాల్ కంపెనీ స్థలం తీసుకోవడానికి అంగీకరించింది. దీంతో బుధవారం కార్పొరేషన్ అధికారులకు స్థలాన్ని అప్పగించారు. ఒక్కరోజు వ్యవధిలోనే కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం కోసం ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను హుటాహుటిన కౌన్సిల్‌కు అందజేశారు. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాక నిర్మాణ పనులు చేపట్టనున్నారు. చెత్త నుంచి విద్యుత్ తిరుపతిలో నిత్యం 200 టన్నుల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. వివిధ రూపాల్లో చెత్తను సేకరిస్తున్న కార్పొరేషన్ ఇటీవల రామాపురం వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మిగిలిన వాటిని తగులబెడుతున్నారు. తడి, పొడిచెత్తను వృథా చేయకుండా తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించారు. 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. భారీ ప్రాజెక్ట్ కావడంతో కనీసం 25 సంవత్సరాల లీజ్తో స్థలం కేటాయించాలని జిందాల్ కంపెనీ కోరింది. ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి చెత్త సేకరణ తిరుపతి నుంచి సేకరించే 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించనున్నారు.100 మెట్రిక్ టన్నుల వ్యర్థాల నుంచి 1 మెగావాట్ సామర్థ్యం కల్గిన విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు. తిరుపతిలో 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మాత్రమే వస్తుండడంతో మరో 100 మెట్రిక్ టన్నుల చెత్తను పక్కమున్సిపాలిటీల నుంచి సేకరించనున్నారు.