స్థలాన్ని పరిశీలిస్తున్న తిరుపతి మున్సిపల్ కమిషనర్ వినయ్ చంద్
వేస్ట్ టు ఎనర్జీ వైపు అడుగులు
Published Fri, Sep 9 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
– చంద్రగిరిలో 16.22 ఎకరాలు అప్పగింత
– రిజల్యూషన్ కోసం కౌన్సిల్‌కు పంపిన కార్పొరేషన్
– ప్లాంట్ ఏర్పాటుకు వీడనున్న గ్రహణం
తిరుపతి తుడా:
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్(వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ) ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు బుధవారం చంద్రగిరి గ్రామ పరిధిలో 16.22 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు కార్పొరేషన్‌కు అప్పగించారు. గురువారం కౌన్సిల్ అనుమతులు కోసం రిజల్యూషన్ దస్త్రాలను పంపారు. ప్రత్యేక అనుమతులు వచ్చిన వెంటనే జిందాల్ కంపెనీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను నిర్మాణ పనులను చేపట్టనుంది.
వ్యర్థాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్లాంట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత రామచంద్రాపురం మండలం రామాపురం వద్ద, చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ పరిధిలో స్థలపరిశీలన చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు ఇవేవీ అనుకూలంగా లేకపోవడంతో 8 నెలలుగా పనులు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించారు. భారీ యంత్రాల ఏర్పాటుకు అనువుగా ఉండడంతో జిందాల్ కంపెనీ స్థలం తీసుకోవడానికి అంగీకరించింది. దీంతో బుధవారం కార్పొరేషన్ అధికారులకు స్థలాన్ని అప్పగించారు. ఒక్కరోజు వ్యవధిలోనే కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం కోసం ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను హుటాహుటిన కౌన్సిల్‌కు అందజేశారు. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాక నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
చెత్త నుంచి విద్యుత్
తిరుపతిలో నిత్యం 200 టన్నుల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. వివిధ రూపాల్లో చెత్తను సేకరిస్తున్న కార్పొరేషన్ ఇటీవల రామాపురం వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మిగిలిన వాటిని తగులబెడుతున్నారు. తడి, పొడిచెత్తను వృథా చేయకుండా తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించారు. 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. భారీ ప్రాజెక్ట్ కావడంతో కనీసం 25 సంవత్సరాల లీజ్‌తో స్థలం కేటాయించాలని జిందాల్ కంపెనీ కోరింది. ఈ మేరకు కార్పొరేషన్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసింది.
ఇతర ప్రాంతాల నుంచి చెత్త సేకరణ
తిరుపతి నుంచి సేకరించే 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించనున్నారు.100 మెట్రిక్ టన్నుల వ్యర్థాల నుంచి 1 మెగావాట్ సామర్థ్యం కల్గిన విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు. తిరుపతిలో 200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మాత్రమే వస్తుండడంతో మరో 100 మెట్రిక్ టన్నుల చెత్తను పక్కమున్సిపాలిటీల నుంచి సేకరించనున్నారు.
Advertisement