
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 34.17 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరిగింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉత్పత్తి. రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యంలో 100 శాతం వరకు విద్యుదుత్పత్తి జరపాలని జెన్‌కోను ఆదేశిస్తూ గత సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంటనే జెన్‌కో ఉత్పత్తి పెంచింది. సోమవారం 11.13 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి జరగగా, మంగళవారం 22.27 ఎంయూలు, బుధవారం 34.17 ఎంయూలకు ఉత్పత్తి పెరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రస్తుతం రోజుకు 3 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుం డటంతో, ఈ అవసరాలను తీర్చేందుకు జలవిద్యుత్ ఉత్పత్తి పెంచినట్లు జెన్‌కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో బుధవారం అత్యధిక విద్యుత్ డిమాండ్ 11,116 మెగావాట్లు ఏర్పడగా, అందులో 1,400 మెగావాట్ల డిమాండ్‌ను జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా తీర్చారు.
శ్రీశైలం, సాగర్‌లో భారీగా ఉత్పత్తి..
ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు, కృష్ణా బోర్డు సూచనలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి గణనీయంగా పెంచింది. శ్రీశైలం ఎడమగట్టుతో పాటు నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలోనూ భారీగా పెంచింది. గత సోమవారం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4.42 ఎంయూల ఉత్పత్తి జరగగా, బుధవారం నాటికి 12.97 ఎంయూలకు పెంచారు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో సోమవారం 1.89 ఎంయూల ఉత్పత్తి జరగగా, మంగళవారం 6.76 ఎంయూలు, బుధవారం 16.12 ఎంయూలకు పెంచారు. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం 22,239 క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 28,252 క్యూసెక్కుల జలాలను రాష్ట్రం దిగువకు విడుదల చేసింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, గరిష్ట నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 823 అడుగుల నీటి మట్టం, 43.4 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఆ సమయానికి ఎగువ నుంచి 10,728 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు వచ్చాయి.
వార్షిక లక్ష్యం 2 వేల ఎంయూలు
రాష్ట్రంలోని 11 జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 వేల ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి బేసిన్‌లోని జలాశయాలకు వచ్చే వరద ప్రవాహంపై ఆయా జల విద్యుత్ ఉత్పత్తి ఆధారపడి ఉండనుంది. ఈ ఏడాది వర్షాలు బాగా పడి ఆగస్టు, సెప్టెంబర్‌లోగా జలాశయాలు నిండితే లక్ష్యానికి మించి ఉత్పత్తి చేయడానికి అవకాశముందని జెన్‌కో అధికారులు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment