- అభ్యర్థిత్వాల కోసం కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ
- మొత్తం ఏడు స్థానాలు ఖాళీ
- కాంగ్రెస్ 4, బీజేపీ 2, జేడీఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం
- రేపు ఢిల్లీ వెళ్లనున్న సిద్ధు, పరమేశ్వర
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభ నుంచి శాసన మండలికి జరుగనున్న ఎన్నికల్లో అభ్యర్థిత్వాలను దక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలో పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
స్వయానా పరమేశ్వర కూడా ఆశావహుడే. శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ప్రత్యామ్నాయ పదవి ఇవ్వడానికి అధిష్టానం కూడా సానుకూలంగా ఉంది. కనుక ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్లే. లోక్‌సభ ఎనికల్లో మండ్య నుంచి ఓడిపోయిన నటి రమ్యతో పాటు మాజీ మంత్రి రాణి సతీశ్ కూడా ఎగువ సభ సభ్యత్వాలను ఆశిస్తున్నారు. రమ్యకు ఇక్కడ కాకపోయినా రాజ్యసభ సభ్యత్వమైనా ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మరో వైపు బీజేపీ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప ఎగువ సభకు వెళ్లడం దాదాపుగా ఖాయం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం ఈశ్వరప్పకు సముచిత పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా లోక్‌సభకు ఎన్నికైన డీవీ. సదానంద గౌడ ఇదివరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన వచ్చే నెలాఖరులో రిటైర్‌డ కావాల్సి ఉంది.
ఇంకా భారతి శెట్టి, కేవీ. నారాయణ స్వామి, ఎంసీ. నాణయ్య, ఎంవీ. రాజశేఖరన్, సిద్ధరాజు, మోనప్ప భండారీలు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇలా ఏర్పడిన ఏడు ఖాళీలను ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో కాంగ్రెస్ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుంది. బీజేపీ రెండు, జేడీఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.