వంటగదిలో రక్షణ కవచం...
ఏప్రాన్ అంటే కెమికల్ లాబొరేటరీలో రీసెర్చ్ చేసే పరిశోధకులు కళ్ల ముందు మెదులుతారు. ఇంగ్లిష్ చానెల్స్‌లో వంటలు చేసే చెఫ్‌లు గుర్తొస్తారు. ఏప్రాన్ అంటే వంట చేసేటప్పుడు దుస్తుల మీద నూనె చుక్కలు, కూరముక్కలు వంటివి పడకుండా కాపాడే వస్త్రంగానే గుర్తిస్తాం. కానీ ఇది అగ్ని ప్రమాదాల నుంచి కాపాడే రక్షణ కవచం కూడ. పొరపాటున నూనె ఒలికి మంట అంటుకుంటే వెంటనే ఏప్రాన్‌కు వెనుక ఉన్న జారుముడిని లాగేసి అక్కడిక్కడే కిందపడేసి నీళ్లు చల్లేయవచ్చు.
ఒంటి మీదకు దుస్తులతోపాటు వీటికోసమూ డబ్బు ఖర్చు చేయాలా అని విసుగు రావడమూ సహజమే. రెడీమేడ్ ఏప్రాన్‌ను కొనడం తప్పనిసరి కాదు. పాతవైపోయిన కుర్తాలను ఏప్రాన్‌లుగా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్తను పాటించాలి. ఏప్రాన్‌లకు నైలాన్, ఉలెన్ వంటి మంటను ఆకర్షించే మెటీరియల్ వాడకూడదు. కాటన్ డ్రస్‌లనే వాడాలి. అలాగే జీన్స్ ప్యాంటు కాళ్లను ఓపెన్ చేసి ఏప్రాన్‌లా కుట్టుకోవచ్చు. ప్యాంటు జేబులు ముందుకు వచ్చేటట్లు కుడితే ఏప్రాన్ చూడడానికి ఇంకా బావుంటుంది. స్పూన్‌ల కోసం ఓ అర రెడీగా ఉన్నట్లే.