జూనియర్ కళాశాలల్లో అటకెక్కిన ప్రయోగాలు | no practical labs in intermediate colleges | Sakshi
Sakshi News home page

జూనియర్ కళాశాలల్లో అటకెక్కిన ప్రయోగాలు

Published Tue, Nov 26 2013 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

no practical labs in intermediate colleges

 సాక్షి, అనంతపురం : గుడిబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఫస్టియర్‌లో 63 మంది, సెకండియర్‌లో 44 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలలో ప్రయోగశాల (ల్యాబ్) లేదు. దీంతో సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. రామగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ బైపీసీ ఫస్టియర్‌లో 15 మంది, సెకండియర్‌లో 16, ఎంపీసీ ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 19 మంది చదువుతున్నారు. వీరు ప్రయోగాల కోసం ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రెండు కళాశాలల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉండడంతో సైన్స్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలే సీబీఎస్‌ఈ తరహాలో ఇంటర్‌లో ప్రవేశపెట్టిన కొత్త సిలబస్‌తో సైన్స్ విద్యార్థులు భయపడుతున్నారు. దీనికితోడు కొన్ని కళాశాలల్లో ప్రయోగశాలలు కరువవడం, ఉన్నచోట కూడా అరకొర పరికరాలు, రసాయనాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రయోగశాలల అభివృద్ధి, నిర్వహణకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు లేకపోవడంతో అధ్యాపకులు సైతం చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (రెండు వొకేషనల్ కళాశాలలతో కలుపుకుని) ఉన్నాయి. వీటిలో ఫస్టియర్ విద్యార్థులు (అన్ని గ్రూపులు కలుపుకుని) 10,333, సెకండియర్ 11,124 మంది ఉన్నారు.
 
  ఫస్టియర్, సెకండియర్ కలుపుకుని సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) గ్రూపుల విద్యార్థులు 4,876 మంది చదువుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. రెండున్నర నెలలు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పుడు అన్ని కళాశాలల్లోనూ విద్యార్థులతో ప్రయోగాలు చేయించాల్సి ఉంది. గుత్తి, ముదిగుబ్బ, రొద్దం, రామగిరి, గుడిబండ కళాశాలల్లో అసలు ప్రయోగశాలలే లేవు. మిగిలిన చోట్ల ఉన్నా.. పరికరాలు, రసాయనాల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 39 కళాశాలలకు గానూ (రెండు వొకేషనల్ మినహాయించి) 17 కళాశాలలకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ నిధులు మంజూరు చేసింది. చిలమత్తూరు, గుంతకల్లు, కదిరి (బాలురు), హిందూపురం (బాలికలు), కళ్యాణదుర్గం, కుందుర్పి, మడకశిర, పామిడి, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ (బాలురు) కళాశాలలకు రూ.2 లక్షల చొప్పున, తాడిమర్రిలో రూ.1.81 లక్షలు, అమరాపురం, కంబదూరు, కణేకల్లు, లేపాక్షి, ఉరవకొండ (బాలికలు) కళాశాలలకు రూ.1.25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. అయితే.. ట్రెజరీలలో ఇంకా బిల్లులు పాస్ కాలేదు. దీనివల్ల పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఇబ్బందిగా మారింది. ఇక మిగిలిన కళాశాలలకు నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
 కనిపించని నూతన పరికరాలు
 ‘నీట్’ పరీక్ష తెరపైకి రావడంతో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌ను సీబీఎస్‌ఈ స్థాయిలో మార్పు చేశారు. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగశాలల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా రసాయనశాస్త్రం సిలబస్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డిగ్రీ స్థాయిలోనూ లేని, అధ్యాపకులు సైతం నేర్చుకోవాల్సిన స్థాయిలో ప్రయోగాలు వచ్చి చేరాయి. దీంతో నూతన పరికరాల అవసరం ఏర్పడింది.
 
  క్రొమొటోగ్రఫీ, కొలాయిడల్ వంటి ద్రావణాల తయారీకి పదార్థాలు, సామగ్రిని కొత్తగా కొనాల్సి వుంది. విద్యార్థుల రెగ్యులర్ ప్రాక్టికల్స్ వల్ల రసాయనాలు అయిపోతుంటాయి. వీటిని ఏటా కొనాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్క రసాయశాస్త్ర ప్రయోగశాలకే రూ.20 వేలకు పైగా ఖర్చు వస్తుంది. బ్యారెట్లు, పిపెట్స్, పరీక్ష నాళికలు.. ఇలా గాజు వస్తువులు పగిలిపోతుంటాయి. వాటినీ కొనకతప్పదు. భౌతిక శాస్త్రం విషయానికొస్తే... సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగాలూ మారాయి. ట్రాన్సిస్టర్, స్ప్రింగ్ బలస్థిరాంకం.. ఇలా కొత్త పరికరాలను కొనాల్సి ఉంది. బాటనీ, జువాలజీ ల్యాబుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. నిధులు మంజూరైన కళాశాలలకు బిల్లులు పాస్ చేయడానికి ట్రెజరీల్లో కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంజూరు కానీ వాటిలో విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తం వెచ్చించి పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసుకోవాలంటూ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ నుంచి ఆదేశాలందాయి. అయితే ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. మారిన సిలబస్‌కు అనుగుణంగా నూతన పరికరాలు, రసాయనాలు కొనాలంటే ఒక్కో కళాశాలకు రూ.50 -60 వేల వరకు అవసరం అవుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement