అరుదైన స్పెసిమెన్లలో సహజ మానవ అస్తిపంజిరం, కింగ్ కోబ్రా..వివిధ రకాల జలచరాలు..పాములు..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): మారుతున్న జనరేషన్..నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగం అనేది అత్యంత కీలకం. మనిషి పుట్టుక ఎలా? తల్లి గర్భంలో శిశువు.. వందల ఏళ్ల నాటి జంతు కలేబరాలు.. వివిధ రకాల జలచరాలు. శతాబ్దంన్నర నాటి మానవ అస్తిపంజిరం. ఇలా.. మానవ.. జంతు పుట్టుకలతో కూడుకున్న ప్రయోగశాల విశాఖ మహానగరంలో ఒకే ఒక కళా శాలలో ఉంది. అదే ఏళ్ల చరిత్ర గల ఏవీఎన్ కళాశాల.
ఏవీఎన్ కళాశాలలో స్వాతంత్య్రం రాకముందు జువాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌తో పాటు మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల/మ్యూజియంలో విశాఖలో మరెక్కడా దొరకని.. లభించని అనేక వస్తువులు పొందుపరిచారు. ఈ మ్యూజియంలో వేలాది స్పెసిమెన్స్, 100కు పైగా ఓస్టీయాలజీ స్పెసిమెన్స్, 75 రకాల మోడల్ స్పెసిమెన్స్‌తో పాటు 878 బాటిల్ స్పెసిమెన్స్, 700 పర్మినెంట్ స్లైడర్స్ ఉన్నాయి.
మానవుని పూర్తి అస్తిపంజిరం (ఒరిజనల్), డాల్ఫిన్ అస్తిపంజిరం, ఏనుగు పుర్రె, హ్యూమన్ బ్రెయిన్, 6,7,8 నెలల మానవ పిండాలు, మానవుని గుండె, రెండు తలల బాతుపిల్ల, ఫైవ్ లెగ్‌డ్ ఫ్రాగ్, తొండం గల పంది పిండం..ఇలా ఎన్నెన్నో మానవుని..జంతువుల అవయవాలు సేకరించారు. అంతేగాక మైక్రోస్కోప్స్..మోనుక్యులర్ అండ్ బైనాక్యులర్, ఆటోక్లేవ్స్, సెంట్రిఫూగ్స్, ఎపిడయోస్కోప్, ఫొటోగ్రఫి ఎక్విప్‌మెంట్, రోటరీ మైక్రోటోమ్, డైనోసర్,హిమోగ్లోబిన్‌మీటర్స్, హిమోసైటోమీటర్స్, వాటర్ బాత్..సెవరల్ బయాలజికల్ చార్ట్స్ ఉన్నాయి.
వీరంతా ఇక్కడి వారే..
ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ రమణమూర్తి, ఏయూ జువాలజీ విభాగ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ లలితకుమారి, ఆంధ్రా మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ బి.దాలినాయిడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేసిన కేవీ రావు, తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె.సత్యగోపాల్, న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పి.రమేష్‌నాయుడు, సినీ ప్రముఖుడు ఎస్వీ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, మాజీ మేయర్ రాజాన రమణి, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, సైంటిస్ట్ డాక్టర్ శొంటి రమేష్‌తో పాటు ఎందరో ఇదే కళాశాలలో..ఇదే విభాగంలో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారు.
కళాశాల జువాలజీ.. ఫిషరీస్ విభాగాధిపతులు వీరే..
1940లో కళాశాలలో జువాలజీ విభాగం ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎ.శ్రీనివాస్ విభాగాధిపతిగా సేవలందించారు. అనంతరం 1945 నుంచి 1975వరకు వీఎస్ వేంకటేశ్వర్లు, 1975 నుంచి 1990 వరకు బీహెచ్‌వీ సీతారామస్వామి, 1990 నుంచి 1993 వరకు డాక్టర్ బి.నాగేశ్వరరావు, 1993 నుంచి 2002 వరకు డాక్టర్ జి.శివరామకృష్ణ, 2002 నుంచి 2010 వరకు బి.విజయభాస్కరరావు విభాగాధిపతులుగా సేవలందించగా 2010 నుంచి ఇప్పటి వరకు డాక్టర్ కె.పుష్పరాజు విభాగాధిపతిగా కొనసాగుతున్నారు.
ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు..
గ్రేటర్ విశాఖ పరిధిలోనే గాక ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరెక్కడా లేని ప్రయోగశాల/మ్యూజియం ఏవీఎన్‌లోనే ఉంది. ఎంతో మంది ఈ కళాశాల నుంచే ఉన్నత పదవులు అధిరోహించారు. మానవ పిండాలకు సంబంధించి ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా తరచూ ఇక్కడకే వస్తుంటారు. –ఆచార్య డి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్, ఏవీఎన్ కాలేజ్
చాలా అరుదైనది
ఏవీఎన్ కళాశాల జువాలజీ నుంచి సినీ నటుడు ఎస్వీ రంగారావు, ఐఏఎస్ అధికారి కేవీ రావు వంటి వారు ఎందరో ఇక్కడే విద్యనభ్యసించారు. ఏవీఎన్ కళాశాల జువాలజీ మ్యూజియంలో అరుదైన స్పెసిమెన్లలో సహజ మానవ అస్తిపంజిరం, డాల్ఫిన్ అస్తి పంజిరం, 6,7,8 నెలల మానవ పిండాలు, రెండు తలల బాతు పిల్ల, తొండం గల పంది పిండం వంటివి ఎన్నో సేకరించాం. –రాంకుమార్, జువాలజీ ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment