స్వైన్ ఫ్లూ నిర్ధారణకు ఏపీలో ల్యాబ్‌లు లేవు
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడి
హైదరాబాద్: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)లాంటి వైరస్‌లు సోకితే నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ల్యాబొరేటరీలు లేవని ఆరోగ్య సంచాలకులు డా. అరుణకుమారి చెప్పారు. రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపాల్సిందేనని తెలిపారు. గురువారం ఆమె వైద్యవిద్య సంచాలకులు డా. శాంతారావు, ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డా. గీతాప్రసాదినిలతో కలసి స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకుంటున్న చర్యలపై విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైతే ఆ నమూనాలను హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో నిర్ధారణ చేస్తున్నామన్నారు. ఏపీలో స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం లేదని తెలిపారు. అయినా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలలో 19 మంది రక్త నమూనాలను సేకరించగా 12 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారని అరుణకుమారి పేర్కొన్నారు.