అసలు ‘యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్’ అంటే ఏమిటో తెలుసుకునే ముందర అన్యురిజమ్ అంటే ఏమిటో చూద్దాం. కొన్నిసార్లు రక్తనాళాల (ధమనుల) గోడలు కొన్ని చోట్ల పలుచబడి బెలూన్‌లా ఉబ్బే ప్రమాదం ఉంది. ఇలా ఉబ్బినట్లు కావడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అ పలచబడిన రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్ (యూఏపీఏ) అంటే... గర్భసంచికి (యుటెరస్‌కు) సప్లై అయ్యే రక్తనాళం ఉబ్బడం. అయితే ‘సూడో’ అంటే వాస్తవమైనది కాదనీ, ఉబ్బులా కనిపిస్తూ, చిట్లినప్పటికీ రక్తస్రావం చాలా కొద్ది ప్రాంతానికి పరిమితమవుతుందని అర్థం. అందుకే దీన్ని ‘యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్’ అని చెప్పవచ్చు. ఇది కాస్తంత అరుదుగా కనిపించే సమస్యే అయినప్పటికీ ప్రాణాంతకం అయ్యే అవకాశమున్నందున దీనిపై అవగాహన కోసం...
నిజానికి సూడో అన్యురిజమ్ గురించి మరింత విపులంగా చెప్పుకోవాలంటే... అన్యురిజమ్స్ అనేవి దేహంలోని రక్తనాళాల్లో ఎక్కడైనా రావచ్చు. మెదడులో, గుండెకు రక్తాన్ని చేసే థొరాసిక్ ప్రాంతాల్లో వచ్చినప్పుడు ప్రమాదకరంగా మారతాయి. అయితే ఇప్పుడు యుటెరస్‌కు రక్తసరఫరా చేసే రక్తనాళం బాగా పలుచబారి ఒక చిన్న బెలూన్‌లా లేదా సంచిలా ఉబ్బి చిట్లితే అది రక్తస్రావం చాలా కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది.
చుట్టుపక్కల ఉండే కణజాలం ఆ రక్తస్రావాన్ని చాలాదూరం ప్రవహించనివ్వదు. అయితే ఈ కండిషన్ తీవ్రమైన బాధ కలిగిస్తుంది. యుటెరస్‌లోని ఫైబ్రాయిడ్స్ వంటి తిత్తులు చిట్లడం వల్ల గానీ లేదా కొన్నిసార్లు గర్భస్రావాలు అయినప్పుడుగానీ ఇలాంటి కండిషన్ ఏర్పడటానికి అవకాశాలెక్కువ. అయితే ఇది తక్షణం శస్త్రచికిత్సకు దారితీయవచ్చు. ఒక్కోసారి తుంటి ఎముక విరగడానికి కూడా అవకాశాలుంటాయి.
లక్షణాలు...
యోని నుంచి భారీగా రక్తస్రావం
ఈ రక్తస్రావంలో మధ్య మధ్య అంతరాయాలు (అంటే... అదేపనిగా కాకుండా కాసేపు కనిపిస్తూ, మరికాసేపు ఆగుతూ అప్పుడప్పుడూ జరుగుతుండవచ్చు)
పొత్తికడుపు నుంచి కింది భాగమంతా తీవ్రమైన నొప్పి
కొన్నిసార్లు పై లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా (అసింప్టమేటిక్‌గా వచ్చే ఈ సమస్య... ఇతర కారణాలను అన్వేషిస్తూ ఇమేజింగ్ పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడవచ్చు).
నిర్ధారణ... ఈ కింద పేర్కొన్న పరీక్షల వల్ల సూడో అన్యురిజమ్ కారణంగా జరుగుతున్న రక్తస్రావాలు తెలుస్తాయి.
డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్
కాంట్రాస్ట్ ఎన్‌హ్యాన్స్‌డ్ అల్ట్రాసౌండ్
కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్)
మేగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎమ్మారై)
యాంజియోగ్రఫీ
చికిత్సలు...
మేనేజ్‌మెంటే తొలి చికిత్స...
అన్యురిజమ్‌కు చికిత్స అన్నది రక్తనాళాల ఉబ్బు సైజు, బాధితురాలిలో కనిపిస్తున్న లక్షణాలను బట్టి ఉంటుంది. ఒకవేళ ఉబ్బు చిన్నగా ఉన్నట్లయితే ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. (ఇందులో చాలా చిన్న గాటుతో అక్కడికి రక్తం చేరకుండా ఆపుతారు). కొన్ని సందర్భాల్లో పూర్తిస్థాయి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. అయితే చిన్నగాటుతో చేసే ఎంబోలైజేషన్‌కే డాక్టర్లు ప్రాధాన్యమిస్తుంటారు. చిన్న గాటుతోనే చికిత్స పూర్తి చేయడానికి అవకాశముండటంతో బాధితురాలికి ప్రాణాపాయం ముప్పు చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం.
యుటెరైన్ ఆర్టరీ సూడో అన్యురిజమ్‌కు అత్యాధునిక చికిత్సలు...
సమస్య ఉన్న ప్రాంతం వంటి అంశాలను బట్టి మరికొన్ని ఆధునిక చికిత్సలను డాక్టర్లు అనుసరిస్తుంటారు. ఉదా: యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) : ఇది ప్రామాణికంగా చేసే చాలా మంచి చికిత్స (గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్‌మెంట్). ఇందులో చాలా చిన్న గాటుతో రక్తనాళంలోకి మరో చిన్న పైప్‌ను (క్యాథెటర్)ను పంపుతారు.
ఆ తర్వాత ఉబ్బు వచ్చిన రక్తనాళాన్ని అనేక చుట్లు చుట్టడం (కాయిలింగ్ చేయడం) ద్వారా ప్రభావితమైన ప్రాంతానికి రక్తసరఫరాను నిలిపివేస్తారు. దాంతో ఉబ్బిన చోటికి రక్తం ఆగడంతో అది చిట్లే ప్రమాదం తప్పిపోతుంది. ఇది చాలా మంచి చికిత్స ప్రక్రియగా అనేక సార్లు నిరూపితమైంది.
శస్త్రచికిత (సర్జికల్ ఇంటర్వెన్షన్) : ఒకవేళ యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ)కి అవకాశం లేకపోయినా లేదా యూఏఈ ప్రక్రియ విఫలమైన సందర్భాల్లో శస్త్రచికిత్సకు పూనుకుంటారు. ఇందులో పలుచబడ్డ ప్రాంతాన్ని తొలగించి, మళ్లీ రక్తనాళాలను కలపడమో లేదా మరీ ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు హిస్టరెక్టమీ ప్రక్రియ ద్వారా గర్భసంచిని తొలగించడమో చేస్తారు.
హైబ్రీడ్ టెక్నిక్స్...
కొన్ని సందర్భాల్లో ఇటు ఎంబోలైజేషన్‌తోపాటు అటు సర్జరీ... ఈ రెండూ కలగలసిన ప్రక్రియలను అనుసరిస్తారు. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఏదైనా కారణాలతో గాయాలైనా లేదా క్యాథెటర్‌తో ఆ ప్రాంతాన్ని చేరడానికి కష్టమవుతున్న సందర్భాల్లో ఇలాంటి ఇరు ప్రక్రియల కలయికతో కూడిన హైబ్రీడ్ టెక్నిక్స్‌ను అవలంబిస్తారు.
డా. సవితా రాథోడ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్
(చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..!)
Comments
Please login to add a commentAdd a comment