
కృత్రిమంగా గుండెని తయారు చేయడం అనేది వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. పైగా దాన్ని ఒక మనిషికి అమర్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడటం మరో అద్భుతం. అయితే అది ఏ కొన్ని గంటలో కాదు ఏకంగా వంద రోజులకు పైగా ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలిపింది. దాత దొరికేంత వరకు ఊపిరిని అందించింది. గుండె వైఫల్యంతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. వైద్య చరిత్రలోనే ఈ కేసు ఓ అద్భుతమని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కృత్రిమ గుండెని ఎవరికీ అమర్చారు. దాని విశేషాలేంటో చూద్దామా..!.
టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండెతో వందరోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్స్ చరిత్ర సృష్టించాడు. ఈ 40 ఏళ్య వ్యక్తికి గత నవంబర్‌లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో టైటానియంతో తయారు చేసిన బివాకర్ అనే పరికరాన్ని అమర్చారు. ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతుండటంతో విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ పాల్ జాన్జ్ నేతృత్వంలో దాదాపు ఆరుగంటలు శ్రమించి ఈ కృత్రిమ గుండె ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని చేశారు.
ఈ ఆధునాత వైద్యాన్ని అందించిన తొలి వైద్య బృందం తామే కావడం గర్వంగా ఉందన్నారు వైద్యుడు జాన్జ్. అంతేగాదు ఇలా ప్రపంచంలో కృత్రిమ టైటానియం గుండెని పొందిన ఆరవ వ్యక్తి అతడేనని చెప్పారు. అతను ఈ గుండెతో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండా వందరోజులకు పైగా బతికి బట్టగట్ట గలిగాడన్నారు. అతడికి ఈ నెల ప్రారంభంలో ఒక దాత గుండెని అమర్చినట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె ఇంప్లాంట్ ప్రక్రియని "అద్భుతమైన క్లినికల్ విజయం"గా ప్రకటించారు ఆస్ట్రేలియన్ వైద్య బృందం.
ఏంటీ టైటానియం బివాకర్..
క్వీన్స్‌ల్యాండ్‌లో జన్మించిన డాక్టర్ డేనియల్ టిమ్స్ ఈ గుండె మార్పిడి బివాకర్ పరికరాన్ని కనుగొన్నారు. దాత గుండె మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు రోగులను సజీవంగా ఉంచడానికి ఇది వారధిలాగా పనిచేస్తుంది. ఇది నిరంతర పంపుగా పనిచేస్తుంది. దీనిలో అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ శరీమంతా సాధారణ పల్స్‌లో రక్తం ప్రసరించేలా చేస్తుంది.
ఇలా సస్పెండ్ చేసి ఉన్న అయస్కాంతం చర్మం వెలుపల ఉన్న త్రాడు మాదిరి పరికరంతో బయట పోర్టబుల్ కంట్రోలర్‌కు కలుపుతుంది. పగటిపూట బ్యాటరీలతో పనిచేస్తుంది. రాత్రిపూట మెయిన్స్‌లో ప్లగ్ చేసి ఉంటుంది. ఇక్కడ టైటానియంని ఉపయోగించడానికి ఇది తుప్పు నిరోధకత కలిగినది, అలాగే బలమైన జీవన వ్యవస్థకు అనూకూలమైనది కావడమే.
ప్రస్తుతం ఈ పరికరాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు..భవిష్యత్తులో ఇది ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా గుండె మార్పిడికి అర్హత లేనివారికి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆ దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె పనితీరు కాల వ్యవధి దాత గుండె కంటే చాలా తక్కువ అనేది గమనించదగ్గ విషయం.
(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment