న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు.
♦ మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు.
♦ జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
♦ శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు.
♦ వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు.
♦ జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.
♦ వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు.
♦ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు.
♦ వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు.
భారత్ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి: ఎర్డోగన్
దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచ్చిన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment