working group
-
NBDA : మరోసారి అధ్యక్షుడిగా అవినాష్ పాండే
న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) 2023-2024 సంవత్సరానికి కార్యవర్గం ఎన్నిక తాజాగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏబీపీ నెట్వర్క్ సీఈవో అవినాష్ పాండే తిరిగి ఎన్నికయ్యారు. అలాగే మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయాంశ్ కుమార్ ఎన్బీడీఏ వైస్ ప్రెసిడెంట్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఇక న్యూస్24 బ్రాడ్కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్ శుక్లా గౌరవ కోశాధికారిగా కొనసాగనున్నారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్‌ను గతంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌గా పిలిచేవారు. ఇది దేశంలోని వివిధ న్యూస్ టెలివిజన్ బ్రాడ్కాస్టర్లకు సంబంధించిన ప్రైవేట్ అసోసియేషన్. ఇందులో రజత్ శర్మ, ఎమ్కే ఆనంద్, రాహుల్ జోషి, ఐ వెంకట్, కల్లి పూరీ భండాల్, సోనియా సింగ్, అనిల్ కుమార్ మల్హోత్రా ఇతర సభ్యులుగా ఉన్నారు. NBDA గురించి న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసొసియేషన్ అనేది ప్రైవేట్ టీవీ ఛానళ్లు, కరెంట్ అఫైర్ ఛానళ్లు, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ల కోసం ఏర్పడిన NBAకి కొత్త రూపం. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని నిర్వహణ పూర్తిగా సభ్యులే నిర్వహించుకుంటారు. ప్రస్తుతం NBDAలో 27 పెద్ద న్యూస్ ఛానళ్లతో పాటు మొత్తమ్మీద 125 న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానళ్లు ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగే వశ్వసనీయమైన సంస్థ NBDA. టీవీ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, వాక్ స్వతంత్ర హక్కును నిలబెట్టడం, మీడియాకు సంబంధించిన తాజా అంశాలను చర్చించడం, కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందుంచడం దీని బాధ్యతలు. తన సభ్యులైన వివిధ టీవీ (న్యూస్, కరెంట్ అఫైర్స్) ఛానళ్లకు సంబంధించిన న్యాయ వివాదాల పరిష్కారంలో NBDA కీలక భూమిక పోషిస్తోంది. -
G20 Ministerial Meet: భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల
న్యూఢిల్లీ/బెంగళూరు: భారతదేశం విభిన్న సమస్యల పరిష్కారాల కోసం ఆదర్శవంతమైన ఒక ప్రయోగశాల అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా సులభంగా అన్వయించవచ్చని నొక్కి చెప్పారు. బెంగళూరులో శనివారం జరిగిన జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లోని డిజిటల్ మౌలిక వసతులతో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సురక్షితమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘భారత్ ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాదిగా మాండలికాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతానికి, అసంఖ్యాక సాంస్కృతిక వారసత్వాలకు భారత్ నిలయం. ప్రాచీన సంప్రదాయాల నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు, ప్రతి ఒక్కరికీ అవసరమైనవి భారత్‌లో ఉన్నాయి. అనేక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ఒక ఆదర్శ ప్రయోగశాల. ఇక్కడ విజయవంతమైన పరిష్కారాన్ని ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా అన్వయించుకోవచ్చు’అని ప్రధాని చెప్పారు. డిజిటల్ సాంకేతికతలో అన్ని దేశాలను భాగస్వా ములను చేసేలా వర్చువల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ ఎకానమీ విస్తరించే కొద్దీ భద్రతా పరమైన సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయంతో విశ్వసనీయమైన, సురక్షితమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత, సమ్మిళిత, శ్రేయస్కరమైన గ్లోబల్ డిజిటల్ భవిష్యత్తు కోసం జీ20 దేశాలకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆర్థికంగా, సాంకేతికతపరంగా భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భాషల అనువాదం కోసం ‘భాషిణి’అనే కృత్రిమ మేధను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లు జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు 50 కోట్లు దాటిపోవడం కీలక మైలురాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో సగానికి పైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కు దాటిందని, ఇందులో 56 శాతం మహిళలకు చెందినవేనని శుక్రవారం ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్‌ధన్ ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
ఈతరం పిల్లలకు గ్లోబల్ చదువులు.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్ గ్రూపు నివేదిక ఇవ్వనుంది. సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. ►దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. ►దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స సబ్జెక్టుల్లో బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ కూడా ఏర్పాటుచేసింది. ►మరో అడుగు ముందుకేస్తూ 2021-2౨లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. ►3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు బోధనలో ఇదొక కీలక మార్పు. ►జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు మరింత సులువుగా, మరింత సమర్థవంతంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులకు అందించింది. ►దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్ కంటెంట్ యాప్‌ను లోడ్ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు. ►తదుపరి విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌టీవీల ఏర్పాటు చేయనుంది. ►దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ►ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ ఛాట్ జీపీటీ, వెబ్ 3.O, అగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. ►విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. ►పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూపు ఖరారు చేయనుంది. ► పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్‌గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్ఈఆర్టీ డైరెక్టర్, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియాకు చెందిన షాలినీ కపూర్, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్ ఏసియాకు చెందిన షాలినీ కపూర్, నాస్కాం ప్రతినిధి సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. చదవండి: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? -
రక్షణ వలయంలో శ్రీనగర్
శ్రీనగర్: శ్రీనగర్‌లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్ఎస్జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్‌లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు. -
జీ20 భేటీపై చైనా అభ్యంతరం.. భారత్ దీటైన జవాబు
శ్రీనగర్: ఈ నెల 22–24 తేదీల మధ్య జి–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం తెలిపింది. జి–20కి సంబంధించిన ఏ విధమైన సమావేశాల్ని కూడా వివాదాస్పద ప్రాంతాల్లో జరపరాదని, అటువంటి సమావేశాలకు తాము హాజరుకాబోమని శుక్రవారం పేర్కొంది. దీనిపై భారత్ దీటుగా స్పందించింది. ‘మా సొంత భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు జరుకునే స్వేచ్ఛ మాకుంది. చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడటం అవసరం’అని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరు కారాదని టర్కీ ఇప్పటికే ప్రకటించగా, సౌదీ అరేబియా నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 100 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం ముందుగా భావించింది. అయితే, సుమారు 60 మంది హాజరవుతారని తాజాగా అంచనా వేస్తోంది. ఇలా ఉండగా, జి–20 సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ)ను రంగంలోకి దించింది. ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించవచ్చన్న అనుమానాల నేపథ్యంలో జి–20 సమావేశాల వేదిక, దాల్‌లేక్‌ను భద్రతా బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గం
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షునిగా దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో రెండ్రోజులు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షునిగా విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి.మోహన్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ మోహన్, శ్రీహరిరెడ్డి, సీతారామయ్య, భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా టి.ప్రభాకర్, పి.శ్యామ్‌రావు, ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పి.శరత్‌బాబు, విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బక్కారెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కోశాధికారిగా గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చందులాల్, శ్రీవాస్తవ్, రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పెంటయ్య తదితరులను ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. -
పీఆర్ ఇంజనీరింగ్ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
సాక్షి, హన్మకొండ: తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎన్నికైంది. హన్మకొండలో శనివారం రాత్రి రాష్ట్ర సర్వసభ్య భేటీ తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ అనంతరం అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డి.సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులుగా జి.నరేంద్రప్రసాద్, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకట్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎ.శ్రీదేవి, వి.సుధీర్‌కుమార్, టెక్నికల్ సెక్రటరీగా కె.విద్యాసాగర్, జోనల్ సెక్రటరీలుగా కె.ప్రకాశ్, ఎం.బి.రేణుక, కోశాధికారిగా కె.రాజశేఖర్ ఎన్నికయ్యారు. -
బంగారం నియంత్రణలపై సమీక్ష
కార్యాచరణ బృందం ఏర్పాటు చేసిన కేంద్రం న్యూఢిల్లీ: బంగారంపై ప్రస్తుతం అమల్లో ఉన్న నియంత్రణపరమైన విధానాల సమీక్షకు కేంద్ర సర్కారు నడుం చుట్టింది. ఇందుకోసం ఓ కార్యాచరణ బృందాన్ని నియమించినట్టు ఆర్థిక వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ సౌరభ్ గార్గ్ సోమవారం వెల్లడించారు. సీనియర్ ఆర్థికవేత్తల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భేటీని ఇండియన్ గోల్డ్ పాలసీ సెంటర్(ఐజీపీసీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో ఆర్థిక వేత్తలతోపాటు బులియన్ బ్యాంకులు, దిగుమతి ఏజెన్సీలు, రిఫైనరీల ప్రతినిధులు, ఆభరణాల తయారీదారులు, ఆభరణాల హోల్‌సేల్ వర్తకులు తదితరులు పాల్గొన్నారు. సరైన విధానాలు అవసరం... బంగారానికి సంబంధించిన డిమాండ్ బలహీనంగా ఉండడానికి దిగుమతులపై అధిక పన్ను, ఎంట్రీ పన్ను, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్ (వ్యాట్) తదితర అంశాలు కారణాలుగా ఈ రంగానికి చెందిన వారు పేర్కొన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం సత్వర ప్రాతిపదికన పరిష్కరించే చర్యలు చేపట్టాలని కోరారు. బంగారంపై జీఎస్టీ 4 నుంచి 6 శాతం విధిస్తే, కస్టమ్స్ డ్యూటీ 10 శాతం కూడా కలసి మొత్తం పన్ను 14 నుంచి 16 శాతం వరకు వినియోగదారులు చెల్లించాల్సి వస్తుందన్నారు. దీని వల్ల బంగారం ధరలు పెరిగి, పరిశ్రమ, వినియోగదారుడి వైఖరిపై ప్రభావం చూపుతుందని ఈ రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం అక్రమ రవాణా కూడా పెరిగిపోతుందన్నారు. సంప్రదాయానికి భిన్నంగా వెళ్లాలి దేశంలో బంగారం అనేది పెట్టుబడులకు, ఆభరణాలకు, ఇచ్చిపుచ్చుకునే మాధ్యమంగా మారినందున ఈ అంశాలన్నింటి దృష్ట్యా సంప్రదాయాలకు భిన్నమైన ఆలోచనలతో జాగ్రత్తతో కూడిన చర్యలు అవసరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ విభాగం డెరైక్టర్ రతిన్ రాయ్ అన్నారు. ఐజీపీసీ హెడ్ అరవింద్ సహాయ్ మాట్లాడుతూ... బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి పెంచడం వల్ల... ధరలు పెరిగి డిమాండ్ తగ్గడం మాత్రమే కాదని, దేశంలోకి బంగారం అక్రమ దిగుమతులకు కూడా కారణమవుతుందన్నారు. -
‘చెలబిన్స్’తో ఏపీ చెలిమి
రష్యా చెలబిన్స్ ప్రావిన్స్ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, రష్యాలోని చెలబిన్స్ ప్రావిన్స్ కలసి పనిచేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ప్రావిన్స్ గవర్నర్ బోరిస్ అంగీకరించారు. చంద్రబాబు మంగళవారం బోరిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెరో ఐదుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘అమరావతి’కి మాస్కో సహకారం ఏపీ రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలకు సహకారం అందించేందుకు రష్యా రాజధాని మాస్కో నగర పాలక సంస్థ ముందుకొచ్చినట్లు హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మాస్కో నగర పాలక సంస్థ విజ్ఞాన పారిశ్రామిక విధాన విభాగం అధిపతి ఒలెగ్ బొచరోవ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గాజ్ప్రోమ్ బ్యాంక్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ యాంట్ సెంటర్, స్వెర్డలోవ్స్క్ గవర్నర్ ఎవిజినీ కుయివషెవ్, ఉక్కు ఉత్పత్తి సంస్థ ఎన్ఎల్ఎంకే గ్రూపు ప్రతినిధులు, బష్కొరొస్తాన్ ప్రభుత్వ ఉప ప్రధాని షరనోవ్ డిమిత్రితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు బృందం మాస్కో పర్యటన ముగించుకుని సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకుని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైంది. కాగా, గోదావరి వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రష్యా నుంచి సమీక్షించారు. లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రజల ఇక్కట్ల పరిష్కారానికి వర్కింగ్ గ్రూపు
న్యూఢిల్లీ: ప్రజల ఇక్కట్ల పరిష్కారం కోసం అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సికి భారతీయ జనతా పార్టీ విన్నవించింది. తమ తమ స్టేషన్ల పరిధిలో తీవ్రస్థాయి నేరాలు జరిగితే అందుకు ఆయా స్టేషన్ హౌస్ అధికారుల (ఎస్హెచ్ఓ)లను కచ్చితంగా బాధ్యులను చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు కమిషనర్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సతీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజల ఈతిబాధల పరిష్కారం కోసం తక్షణమే ఓ అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఆయా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఎస్)లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను సభ్యులుగా తీసుకోవాలి. దీంతోపాటు ఆయా వర్తక సంఘాలకు చెం ది న ప్రతినిధులను కూడా అందులో సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ వర్కి ంగ్ గ్రూపు కనీసం నెలకొకసారి కచ్చితంగా సమావేశం కావా లి. ఆయా పోలీస్ స్టేషన్లలో కొలి క్కిరాని కేసులను ఈ గ్రూపు ... పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి’ అని అన్నారు. దీంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలో ఠాణా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. -
రైతులకు సాగు ఖర్చుపై 50 శాతం లాభం!
చండీగఢ్: పంటల సాగు ఖర్చుపై రైతులకు 50% లాభం చేకూర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మో„హన్‌సింగ్ నియమించిన వర్కింగ్ గ్రూప్ కేంద్రానికి సిఫారసు చేసింది. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ఈ కమిటీకి నేతృత్వం వహించారు. సాగు ఖర్చుపై 50% లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటే ధాన్యం, గోధుమలపై ప్రత్యేకించి బోనస్‌లు ప్రకటించాల్సిన అవసరం ఉండబోదని సిఫారసు చేశామని హూడా శనివారం చెప్పారు. తన ఇంటికి వచ్చిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులకు స్థిరాదాయం చేకూర్చేందుకు సాగు ఖర్చుపై సగం మొత్తం వరకూ లాభం వచ్చేలా చూడాలని తమ కమిటీ సిఫారసు చేసిందన్నారు. పంటల సాగుకు అయ్యే ఖర్చుకు సగ భాగాన్ని కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలని అనేక ఏళ్ల క్రితమే డాక్టర్ స్వామినాధన్ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ ఈ సిఫారసులను పట్టించుకున్న పాపానపోని యూపీఏ ప్రభుత్వం రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యానే ఈ అంశంపై వర్కింగ్ గ్రూప్‌ను నియమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.