‘చెలబిన్స్’తో ఏపీ చెలిమి
రష్యా చెలబిన్స్ ప్రావిన్స్ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, రష్యాలోని చెలబిన్స్ ప్రావిన్స్ కలసి పనిచేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ప్రావిన్స్ గవర్నర్ బోరిస్ అంగీకరించారు. చంద్రబాబు మంగళవారం బోరిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చెరో ఐదుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
‘అమరావతి’కి మాస్కో సహకారం
ఏపీ రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలకు సహకారం అందించేందుకు రష్యా రాజధాని మాస్కో నగర పాలక సంస్థ ముందుకొచ్చినట్లు హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మాస్కో నగర పాలక సంస్థ విజ్ఞాన పారిశ్రామిక విధాన విభాగం అధిపతి ఒలెగ్ బొచరోవ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గాజ్‌ప్రోమ్ బ్యాంక్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ యాంట్ సెంటర్, స్వెర్డలోవ్స్క్ గవర్నర్ ఎవిజినీ కుయివషెవ్, ఉక్కు ఉత్పత్తి సంస్థ ఎన్‌ఎల్‌ఎంకే గ్రూపు ప్రతినిధులు, బష్కొరొస్తాన్ ప్రభుత్వ ఉప ప్రధాని షరనోవ్ డిమిత్రితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు బృందం మాస్కో పర్యటన ముగించుకుని సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకుని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైంది. కాగా, గోదావరి వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రష్యా నుంచి సమీక్షించారు. లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.