న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్ (NBDA) 2023-2024 సంవత్సరానికి కార్యవర్గం ఎన్నిక తాజాగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే తిరిగి ఎన్నికయ్యారు.
అలాగే మాతృభూమి ప్రింటింగ్ & పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ శ్రేయాంశ్ కుమార్ ఎన్‌బీడీఏ వైస్ ప్రెసిడెంట్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఇక న్యూస్24 బ్రాడ్‌కాస్ట్ ఇండియా లిమిటెడ్ చైర్‌పర్సన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్ శుక్లా గౌరవ కోశాధికారిగా కొనసాగనున్నారు.
న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ & డిజిటల్ అసోసియేషన్‌ను గతంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌గా పిలిచేవారు. ఇది దేశంలోని వివిధ న్యూస్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌లకు సంబంధించిన ప్రైవేట్ అసోసియేషన్. ఇందులో రజత్ శర్మ, ఎమ్‌కే ఆనంద్, రాహుల్ జోషి, ఐ వెంకట్, కల్లి పూరీ భండాల్, సోనియా సింగ్, అనిల్ కుమార్ మల్హోత్రా ఇతర సభ్యులుగా ఉన్నారు.
NBDA గురించి
న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ & డిజిటల్ అసొసియేషన్ అనేది ప్రైవేట్ టీవీ ఛానళ్లు, కరెంట్ అఫైర్ ఛానళ్లు, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ల కోసం ఏర్పడిన NBAకి కొత్త రూపం. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని నిర్వహణ పూర్తిగా సభ్యులే నిర్వహించుకుంటారు.
ప్రస్తుతం NBDAలో 27 పెద్ద న్యూస్ ఛానళ్లతో పాటు మొత్తమ్మీద 125 న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానళ్లు ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అంశాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగే వశ్వసనీయమైన సంస్థ NBDA. టీవీ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, వాక్ స్వతంత్ర హక్కును నిలబెట్టడం, మీడియాకు సంబంధించిన తాజా అంశాలను చర్చించడం, కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందుంచడం దీని బాధ్యతలు. తన సభ్యులైన వివిధ టీవీ (న్యూస్, కరెంట్ అఫైర్స్) ఛానళ్లకు సంబంధించిన న్యాయ వివాదాల పరిష్కారంలో NBDA కీలక భూమిక పోషిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment