AP government set up Working Group to enhance 'Education' policies - Sakshi
Sakshi News home page

ఈతరం పిల్లలకు గ్లోబల్‌ చదువులు.. ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

Published Sun, Jun 11 2023 11:02 AM

Ap Government Set Up Working Group For Education Policies - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీరిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారికి హైఎండ్‌ టెక్నాలజీ రంగంలోని ఉన్నత ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్‌ టెక్‌ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేశారు. పాఠ్యప్రణాళిక, ఉండాల్సిన మానవవనరులు, సదుపాయాలపై వచ్చేనెల జులై 15 కల్లా వర్కింగ్‌ గ్రూపు నివేదిక ఇవ్వనుంది.

సీఎం జగన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యాదీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా, మౌలిసదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకు వచ్చారు. 

దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతున్నాయి. 

దీనికి అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరంలో సీఎం జగన్‌ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందించింది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, మాథమెటిక్స సబ్జెక్టుల్లో బై లింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను అందించింది. ఇంగ్లిషులో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్‌ కూడా ఏర్పాటుచేసింది. 

మరో అడుగు ముందుకేస్తూ 2021-2౨లో 6వ తరగతి నుంచి 10వ తరగతివరకూ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని విద్యార్థులకు అందించింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పిక్టోరియల్‌ డిక్షనరీని అందించింది. 

3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులకు బోధనలో ఇదొక కీలక మార్పు.

జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

విద్యార్థులకు సైన్స్‌, సోషల్, మాథమెటిక్స్‌లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు మరింత సులువుగా, మరింత సమర్థవంతంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఉండేందుకు ఆడియో, విజువల్‌ రూపంలో బైజూస్‌ కంటెంట్‌ను విద్యార్థులకు అందించింది. 

దీనికోసం ఎనిమిదో తరగతి చదువుతున్న 5,18,740 మంది విద్యార్థులకు ట్యాబులు అందించింది. ఇందులో బైజూస్‌ కంటెంట్‌ యాప్‌ను లోడ్‌ చేశారు. అందులో పాఠ్యాంశాలు ఆడియో, వీడియో రూపంలో ఉండడంవల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతున్నారు.

తదుపరి విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం- పాఠశాలల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియను విస్తృతంగా చేపట్టింది. నాడు-నేడు పూర్తిచేసుకున్న 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్స్‌ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం జులై కల్లా ఈ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక మరో 10,038 తరగతి గదుల్లో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో ఈవచ్చే డిసెంబర్‌ నాటికి ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌టీవీల ఏర్పాటు చేయనుంది. 

దీంతోపాటు ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్‌ పరీక్షలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం. ప్రపంచస్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిషులో పరిజ్ఞానం అన్నది చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని  ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీంతోపాటు భవిష్యత్తు టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టింది.  ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం), ఎల్‌ఎల్‌ఎం ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్‌ ఛాట్‌ జీపీటీ, వెబ్‌ 3.O, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ, వర్చువల్‌ రియాల్టీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సెంట్ర్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ, అటానమస్‌ వెహికల్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, గేమింగ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను, మార్పులను సూచించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. 

విద్యాభ్యాసం తొలినాళ్లనుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్యప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ తదితర అంశాలపై ఈ వర్కింగ్‌ గ్రూపు ద్వారా ప్రభుత్వం దృష్టిపెట్టనుంది. 

పాఠ్యప్రణాళిక, మౌలిక సదుపాయాలు, మానవవనరులు, లెర్నింగ్‌ కంటెంట్, ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్‌ గ్రూపు ఖరారు చేయనుంది. 

 పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సెక్రటరీ మెంబర్‌గా ఉంటారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. స్కూలు ఎడ్యుకేషన్‌ కమిషనర్‌, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌, మైక్రో సాఫ్ట్ ఇండియాకు చెందిన అశుతోష్‌ చద్దా,  అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇండియాకు చెందిన షాలినీ కపూర్‌, గూగుల్‌కు చెందిన ప్రతినిధి, ఇంటెల్‌ ఏసియాకు చెందిన షాలినీ కపూర్‌, నాస్కాం ప్రతినిధి సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఎకానమీ పాలసీ రీసెర్చ్‌ అధ్యక్షుడు జైజిత్‌ భట్టాచార్య, నీతి ఆయోగ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ మాజీ సలహాదారు అర్చనా. జి.గులాటి  వర్కింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  జులై 15, 2023 నాటికల్లా ఈవర్కింగ్‌ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.


చదవండి: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ?

Advertisement
 
Advertisement
 
Advertisement