బంగారం నియంత్రణలపై సమీక్ష
కార్యాచరణ బృందం ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: బంగారంపై ప్రస్తుతం అమల్లో ఉన్న నియంత్రణపరమైన విధానాల సమీక్షకు కేంద్ర సర్కారు నడుం చుట్టింది. ఇందుకోసం ఓ కార్యాచరణ బృందాన్ని నియమించినట్టు ఆర్థిక వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ సౌరభ్ గార్గ్ సోమవారం వెల్లడించారు. సీనియర్ ఆర్థికవేత్తల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భేటీని ఇండియన్ గోల్డ్ పాలసీ సెంటర్(ఐజీపీసీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో ఆర్థిక వేత్తలతోపాటు బులియన్ బ్యాంకులు, దిగుమతి ఏజెన్సీలు, రిఫైనరీల ప్రతినిధులు, ఆభరణాల తయారీదారులు, ఆభరణాల హోల్‌సేల్ వర్తకులు తదితరులు పాల్గొన్నారు.
సరైన విధానాలు అవసరం...
బంగారానికి సంబంధించిన డిమాండ్ బలహీనంగా ఉండడానికి దిగుమతులపై అధిక పన్ను, ఎంట్రీ పన్ను, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్ (వ్యాట్) తదితర అంశాలు కారణాలుగా ఈ రంగానికి చెందిన వారు పేర్కొన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం సత్వర ప్రాతిపదికన పరిష్కరించే చర్యలు చేపట్టాలని కోరారు. బంగారంపై జీఎస్టీ 4 నుంచి 6 శాతం విధిస్తే, కస్టమ్స్ డ్యూటీ 10 శాతం కూడా కలసి మొత్తం పన్ను 14 నుంచి 16 శాతం వరకు వినియోగదారులు చెల్లించాల్సి వస్తుందన్నారు. దీని వల్ల బంగారం ధరలు పెరిగి, పరిశ్రమ, వినియోగదారుడి వైఖరిపై ప్రభావం చూపుతుందని ఈ రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం అక్రమ రవాణా కూడా పెరిగిపోతుందన్నారు.
సంప్రదాయానికి భిన్నంగా వెళ్లాలి
దేశంలో బంగారం అనేది పెట్టుబడులకు, ఆభరణాలకు, ఇచ్చిపుచ్చుకునే మాధ్యమంగా మారినందున ఈ అంశాలన్నింటి దృష్ట్యా సంప్రదాయాలకు భిన్నమైన ఆలోచనలతో జాగ్రత్తతో కూడిన చర్యలు అవసరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ విభాగం డెరైక్టర్ రతిన్ రాయ్ అన్నారు. ఐజీపీసీ హెడ్ అరవింద్ సహాయ్ మాట్లాడుతూ... బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి పెంచడం వల్ల...
ధరలు పెరిగి డిమాండ్ తగ్గడం మాత్రమే కాదని, దేశంలోకి బంగారం అక్రమ దిగుమతులకు కూడా కారణమవుతుందన్నారు.