న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment