సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని ఈ నెల 8వ తేదీన విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో 7వ తేదీన ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (వైఎస్సార్‌ఎల్పీ) సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ భేటీకి 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రెండో శాసనసభలోకి అడుగు పెడుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పునకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలనే దానిపై ప్రధానంగా జగన్ మాట్లాడతారని తెలుస్తోంది.
వాగ్దానాల అమలు... పార్టీ బలోపేతం
మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుందన్న ఊహాగానాలు ఎమ్మెల్యేల్లో సాగుతుండడంతో ఈ అంశంపై కూడా జగన్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రభుత్వ పరంగా కృషి చేయడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మంత్రివర్గం కూర్పు విషయంలో ప్రాంతీయ, సామాజిక వర్గాల మధ్య పాటించాల్సిన సమతౌల్యం, పార్టీలో తీసుకురావాల్సిన మార్పుల గురించి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు వివరిస్తారని సమాచారం.
10న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు!
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన విధంగానే మంత్రివర్గాన్ని సైతం విడతల వారీగా కాకుండా ఒకేసారి విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీలో చర్చ సాగుతోంది. 8వ తేదీన 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవుల ఎంపికపైనా జగన్ పూర్తి స్పష్టతతో ఉన్నట్లు చెబుతున్నారు.
సాధారణంగా అయితే కొత్త శాసనసభ ప్రారంభానికి ముందు విజయం సాధించిన పార్టీ తమ శాసనసభాపక్షం నేతను ఎన్నుకోవడానికే సమావేశం అవుతూ ఉంటుంది. ఆ తరువాత మళ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తరువాతనే తదుపరి శాసనసభాపక్షం సమావేశమవుతుంది. కానీ, దీనికి భిన్నంగా జగన్ ప్రస్తుతం కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తొలి శాసనసభా సమావేశాల ప్రారంభానికి ముందే మరోసారి తమ పార్టీ శాసనసభాపక్షాన్ని సమావేశపరుస్తున్నారు.
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఆ తరువాత రెండు రోజులకు జూన్ 10వ తేదీన నూతనంగా విస్తరించిన మంత్రివర్గం తొలి సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరుగుతుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన పలు సంకేతాలను జగన్ ఇచ్చారు.
14న ఉభయ సభల సంయుక్త సమావేశం
రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజున ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన 175 ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకేరోజున ప్రమాణ స్వీకారం పూర్తయితే, మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాలు రెండోరోజు కూడా కొనసాగితే.. అవి ముగిశాక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 14వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తరువాత రోజున ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు సభల్లోనూ చర్చ, ముఖ్యమంత్రి సమాధానానికి ఆమోదం ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment