మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆటోలకు జీవిత కాలం, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాలన్న ప్రతిపా దనలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ముగ్గురి నుంచి ఏడుగురు ప్రయాణించే మూడు చక్రాల ఆటోలు, సరకు రవాణా చేసే మూడు చక్రాల ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన తేలికపాటి వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రయలర్లపై పన్ను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మోటారు వెహికిల్ ట్యాక్స్ ఎరియర్స్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలు నడిపేవారికి ఈ ఏడాది రూ.60 కోట్లు , ప్రతి ఏటా రూ.55 కోట్లు లబ్ధి పొందుతారని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు వల్ల 9.79 లక్షల వాహన యజమానులకు లబ్ధి కలుగుతుందన్నారు. పాసింజర్ ఆటో రిక్షాలు 5.66 లక్షలు ఉన్నాయని, వీటిపై ఏడాదికి రూ.20 కోట్ల జీవిత కాల, త్రైమాసిక పన్ను మినహాయించారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం రూ. వెయ్యి ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు, రూ.1500 ఉన్న పెన్షన్‌ను రూ.3 వేలు చేశామన్నారు. మంత్రి వర్గం ఆమోదించిన మరిన్ని అంశాలు..
– ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలలో ప్రస్తుతం ఒక డీఏ ఈ జీతం నుంచి సర్దుబాటు. ఒక డీఏ బకాయి మొత్తం రూ.513.13 కోట్లు వాయిదాల రూపంలో చెల్లించేలా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయం.
– వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు 2015 ప్రకారం మినిమం టైమ్ స్కేలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు.
– చుక్కల భూములు, ఇళ్ల పట్టాల విషయంలో జాయింట్ కలెక్టర్‌కు బదులుగా ఆర్డీవోలకే అధికారం.
– 2014 జూన్ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న లక్షా 26 వేల 97 ఇళ్లకు ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయం. ఒక్కో ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.15 వేలతో కలిపి రూ.60 వేల చొప్పున లబ్దిదారునికి ఇవ్వనున్నారు. దీని కోసం రూ.756 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 1996–2004 మధ్య వివిధ పట్టణ ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 20 వేల యూనిట్లకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు.
– అర్బన్ హౌసింగ్ కోసం భీమునిపట్నం మండలం కొత్తవలసలో 94.86 ఎకరాలు, పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలు (మొత్తం 222.32 ఎకరాలు) చొప్పున ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉడాకు అనుమతి.
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జుడీషియల్ అఫీషియల్స్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయింపుపై నూతన విధానం. మార్గదర్శకాలు రూపొందించేందుకు ఆమోదం. ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు చొప్పున సొసైటీల ద్వారా స్థలాలు కేటాయిస్తారు. ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రెండేళ్లకు మించి రాష్ట్రంలో పని చేస్తున్న అందరికీ స్థలాలు కేటాయిస్తారు. సెక్రటేరియెట్, లెజిస్లేచర్‌లలో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ సిబ్బందికి, రాష్ట్ర రాజధానిలోని హెచ్‌వోడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. అటానమస్ ఆర్గనైజేషన్లలో పని చేసే వారికి స్థలాలు కానీ, ఫ్లాట్లను కానీ భూమి లభ్యతను బట్టి నామినల్ మార్కెట్ రేటుకు కేటాయిస్తారు. రాష్ట్రంలో రీజినల్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వారీగా పనిచేసే ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నివాసాలు కల్పిస్తారు. గ్రూపు, లేదా కోఆపరేటీవ్ సొసైటీ ద్వారానే ఈ కేటాయింపులు జరుగుతాయి.
– ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జనరల్ హౌసింగ్ పాలసీ, కేపిటల్ సిటీ హౌసింగ్ ఎంకరేజ్‌మెంట్ పాలసీలు తీసుకొచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం.
– అమరావతి అక్రిడేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జర్నలిస్టులకు సంబంధించి)కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్‌డీఏ పరిధిలో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగర ప్రాంతంలో హౌస్ సైట్, ఇల్లు ఉన్నవాళ్లు అర్హులు కారు. గతంలో ప్రభుత్వ లబ్ధి పొందని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం.
– రూ.10 కోట్ల బడ్జెట్‌తో చేనేత కార్మికుల వైద్య ఆరోగ్య బీమా పథకం. కుటుంబానికి రూ.20 వేల చొప్పున బీమా.
– ఇప్పటికే ఉన్న రూ.50 కోట్ల డిపాజిట్లతో కలిపి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.300 కోట్లు ముందస్తుగా చెల్లించేలా కోర్టును కోరాలని నిర్ణయం.
– చిత్తూరు, నెల్లూరు జిల్లాలు.. పుంగనూరులోని కేబీడీ షుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్ షుగర్స్, బీఎన్ కండ్రిగలోని సుదలగుంట షుగర్స్, పొదలకూరులోని సుదలగుంట షుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ షుగర్స్ సంస్థలకు రూ.47.54 కోట్ల మేర పన్ను మినహాయింపు. కోఆపరేటీవ్, నిజాం షుగర్స్ (పబ్లిక్ సెక్టారు), ఖండసారి షుగర్ మిల్లులకు సంబంధించి కొనుగోలు పన్ను, వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి రూ.227,04,59,292 మినహాయింపు.
– పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ అర్బన్ వాటర్ సప్లయ్ అండ్ సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు కింద రూ.2,685.58 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం.
– బందరు డీప్ వాటర్ పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అవసరమైన భూమి ఎకరం రూ.40 లక్షల చొప్పున 122.95 ఎకరాలను ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద మేకవానిపాలెం, పోతిపల్లి గ్రామాల్లో కొనుగోలు చేయాలన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలకు ఆమోదం.
– రాజధానిలోని ఐనవోలులో వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) భవనాలను 45 మీటర్ల మేర ఎత్తుకు నిర్మించుకునేందుకు అనుమతి.
– ఏపీ కో–ఆపరేటీవ్ సొసైటీల చట్టం–1964లో తగిన మార్పులు చేస్తారు.
– గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన ల్యాండ్ పూలింగ్ రైతులకు రాజధానిలో కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్సే్ఛంజ్ డీడ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు.
– రాజధానిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్ర నిర్మాణానికి సీఆర్‌డీఏ కేటాయించిన 25 ఎకరాల భూమి సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ పత్రాలపై స్టాంపులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పన్ను రూ.1,00,20,600 మినహాయింపు.
– విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో 1052.86 చదరపు గజాల మునిసిపల్ ల్యాండ్‌ను మంత్రాలయం శ్రీరాఘవేంద్ర మఠం వారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో నాలుగో వంతు ధరకు కేటాయింపు.
– ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్‌ఐలుగా పదోన్నతికి ఆమోదం.
– హైకోర్టుకు కొత్తగా తొమ్మిది రిజిష్ట్రార్ పోస్టులు మంజూరు.
– జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సూపరాన్యుయేషన్ వయసు కంటే తక్కువగా ఉంటే ఒక ఏడాది పదవీకాలం పొడిగింపు.
– తూర్పుగోదావరి జిల్లా చింతూరు గ్రామంలోని నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమయ్యే 27 టీచింగ్, 14 నాన్ టీచింగ్ ఉద్యోగాలు మంజూరు. విశాఖ జోన్–1 కు జాయింట్ డెరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టు మంజూరు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోసం ఒక చీఫ్ ఇంజనీర్, రెండు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఆరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల పోస్టులు మంజూరు.
– శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల పార్కు నిర్మాణం కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు.
– శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరం గ్రామంలో పట్టణ ప్రాంత పేదల గృహ నిర్మాణం కోసం మునిసిపల్ కమిషనర్‌కు 23.36 ఎకరాల ప్రభుత్వ భూమి ముందస్తుగా స్వాధీనం.
– కృష్ణా జిల్లా చల్లపల్లిలో శ్రీ విజయ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీకి ఐదు ఎకరాల భూమి 20 ఏళ్ల పాటు లీజు.
– అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమిటికుంట గ్రామం వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 2.44 ఎకరాల భూమి కేటాయింపు.
– వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం బూచుపల్లి, మల్లెల, తొండూరు ప్రాంతంలో విండ్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 42.70 ఎకరాల భూమి కేటాయింపు.
– బాబు జగ్జీవన్ రామ్ సమతా స్ఫూర్తివనం నిర్మాణానికి రూ.50 కోట్లు, 10 సెంట్ల భూమి కేటాయింపు. అమరావతిలో సీఆర్‌డీఏ నిర్మాణ స్థలాన్ని గుర్తించాక మరో రూ.50 కోట్లు చెల్లించాలని నిర్ణయం.
Comments
Please login to add a commentAdd a comment