సంకల్ప రాజధాని: సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి సంకల్ప పత్రాలు తెప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అందరి సంకల్పబలంతో రాజధానిని నిర్మిస్తామన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆయన ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు ‘మన మట్టి-మన నీరు’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 13న అన్ని గ్రామాలవారు మట్టి, జలాలను సేకరిస్తారని, పూజలు చేసి 14, 15 తేదీల్లో మండల కేంద్రాలకు, 17వ తేదీన నియోజకవర్గ కేంద్రాలకు తీసుకొస్తారని వెల్లడించారు. 19వ తేదీ సాయంత్రానికి నీరు, మట్టి, సంకల్ప పత్రాలను గుంటూరు సమీపంలోని నాగార్జున వర్సిటీకి ఎదురుగా ఉన్న ప్రాంతానికి చేరుస్తారని, 20వ తేదీన శంకుస్థాపన జరిగే ప్రదేశం వద్దకు చేరుస్తారని వివరించారు. అక్కడ ఈ మట్టి, నీరును కలిపి దాన్ని శంకుస్థాపనకు వినియోగిస్తామన్నారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ మట్టిని వాడతామన్నారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏం చెప్పారంటే...
►విజయవాడ కనకదుర్గమ్మ, అమరావతి అమరేశ్వరాలయం, ఒక చర్చి, ఒక మసీదు నుంచి సంకల్ప జ్యోతులను శంకుస్థాపనకు తీసుకొస్తారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీతోపాటు జపాన్ మంత్రి మితో ఇసుకి తొ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వస్తున్నారు. దేశంలో ముఖ్య నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు, అన్ని దేశాల రాయబారులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులను ఆహ్వానిస్తున్నాం.
►అనవసర ఖర్చులు లేకుండా.. పూర్తిస్థాయిలో మార్కెటింగ్ జరిగేలా జాగ్రత్తగా వ్యవహారించాలని అధికారులకు సూచించాం. శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానిస్తా. వీలైనంతవరకూ వారితో వివాదాలు లేకుండా సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. వివాదాల వల్ల వనరులు, సమయం వృథా అవుతున్నాయి.
►పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం నిర్మాణ సంస్థకు సవరించిన అంచనాల ప్రకారం సొమ్ము ఇవ్వాల్సి ఉంది.
►{పాజెక్టు మానిటరింగ్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి గడువులోగా స్పిల్‌వే, ఎర్త్‌వర్క్ చేయిస్తాం. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోతే సెక్షన్ 16సీ ప్రకారం వేరే వాళ్లకు అప్పగిస్తాం. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు కడతానన్నా మాకు అభ్యంతరం లేదు. రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చాలని నిర్ణయించాం. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి కేంద్రానికి తెలియజేస్తాం. అన్ని రికార్డుల్లో ఈ మార్పు జరిగేలా చూస్తాం. నెల్లూరు జిల్లా ఎస్.కోట మండలంలో 52 ఎకరాలను పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి ఇవ్వాలని నిర్ణయించాం. కృష్ణపట్నం పోర్టుకు రైల్వే లైను నిర్మాణం కోసం రైల్వే శాఖకు తొమ్మిది ఎకరాలు ఇస్తున్నాం.
►రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సి ఉంది.
►{పత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలైపోతున్నాయని చెబుతున్నారు, ఇలా ఏ రాష్ట్రం కూడా స్వర్గంగా మారలేదు.