అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
సాక్షి, అమరావతి: ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ సహా మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆక్వా అనుమతులు, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు కూడా సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
⇔ భూ విక్రయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు ఇప్పుడున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ. రిజిష్ట్రేషన్ల చట్టం-1908లో మార్పులు తీసుకొచ్చే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. దీనిప్రకారం ఒకే భూమిని ఇద్దరికి రిజిష్ట్రేషన్ చేయడానికి ఇకపై వీలు పడకుండా చర్యలు తీసుకుని సివిల్ తగాదాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం.
⇔ ఏపీ వ్యాట్ చట్టం 2005ని సవరించి పర్యాటక ప్రాంతాల్లోని త్రీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో వ్యాట్ పన్ను 14.5 % నుంచి ఐదు శాతానికి తగ్గించేందుకు అనుమతి. మొబైల్ ఫోన్లపైనా పన్ను 5 శాతానికి తగ్గింపు. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం.
⇔ బీసీ కమిషన్ సిఫారసుల మేరకు వెనుకబడిన తరగతుల జాబితాలోని సీరియల్ నెంబర్ 37 గ్రూపులో ఉన్న వడ్డె, వడ్డీలు, వడ్డి, వడ్డెలు అనే పదాలకు పర్యాయపదాలుగా వడ్డెర, వడ్డబోవి, వడ్డియరాజ్, వడ్డెర పదాలను చేర్చడానికి ఆమోదం.