అబూ ధాబీలో ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13) పెద్దగా సాఫల్యతలు లేకుండానే ముగిసింది. భారత్ లాంటి దేశాలకు ముఖ్యమైన మత్య్స రాయితీల అంశంలో, ప్రభుత్వాలు నిల్వచేసే ఆహార ధాన్యాల అంశంలో ఏ విధమైన పరిష్కారాలనూ కనుగొనలేదు. పైగా వివాదాల పరిష్కారం కోసం ఉద్దేశించిన అప్పిలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా ససేమిరా అంది. అదే జరిగితే మళ్లీ ‘గాట్’ రోజులకు తిరిగి మరలాల్సి ఉంటుంది. ఇక, డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ దేశం ఏకంగా డబ్ల్యూటీవో నుంచే నిష్క్రమించినా ఆశ్చర్యం లేదు. 166 సభ్య దేశాలున్న ఈ సంస్థ ఉనికి ఇప్పటికే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన ఒప్పందాల విషయంలో త్వరపడాలి.
అబూ ధాబీలో (ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 2 వరకు) జరిగిన మరో డబ్ల్యూటీవో (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) మంత్రివర్గ సమావేశం ఎలాంటి ఆసక్తిని రేకెత్తించకుండానే ముగిసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన విధులు,అంటే చర్చల పనివిధానం, వివాద పరిష్కార పనితీరు గత కొంత కాలంగా స్తంభించిపోయాయి. ఇప్పటికే సమస్యల్లో ఉన్న ఈసంస్థకు చెందిన 166 సభ్యదేశాల్లో బలమైన విభజనలు పెంచేలా, ఈ రెండింటినీ పునరుద్ధరించే ప్రయత్నాలు ఫలించలేదు.అబూ ధాబీలో జరిగిన 13వ మంత్రివర్గ సమావేశం (ఎంసీ 13)లో డబ్ల్యూటీఓ సభ్యులకు నాలుగు ప్రధాన సవాళ్లు ఎదుర య్యాయి.
ఒకటి, మత్స్య రాయితీలపై అంతుచిక్కని బహుపాక్షిక ఒప్పందాన్ని ఎలా ముగించాలి? రెండు, అప్పీలేట్ బాడీని ఎలా పున రుద్ధరించాలి? తద్వారా వివాద పరిష్కార యంత్రాంగంగా డబ్ల్యూ టీఓ కిరీటంలో ఆభరణంగా ఉన్న దాని ఖ్యాతిని తిరిగి ఎలా పున రుద్ధరించాలి? మూడు, భారతదేశంతోపాటు అనేక ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ (ఆహార భద్రత కోసం ధాన్యాన్ని ప్రభుత్వం నిల్వచేయడం) సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఎలా పొందాలి? చివరగా, పరిశ్రమ కోరుతున్న ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ లపై కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన మారటోరియం పొడిగింపును ఎలా నిర్ధారించాలి? ఇందులో ఉన్న ఆదాయ నష్టం కారణంగా కొన్ని ప్రభుత్వాలు (భారత్ వంటివి) దీన్ని ఇష్టపడలేదు. కొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నా, ఇవి ఎంసీ 13 కోసం ప్రధాన అజెండా అయ్యాయి.
మత్స్యకారులకు సబ్సిడీలపై బహుపాక్షిక ఒప్పందం గత మంత్రి వర్గ సమావేశంలో పాక్షికంగా ముగిసింది. ఇది అమల్లోకి వచ్చేలా ఈ ఎంసీ 13లో పూర్తి చేయవలసి ఉంది. కానీ ఈ సందర్భంలో,సంధానకర్తలు ఏదీ సాధించలేకపోయారు. భారత్ సమానత్వంకోసం, న్యాయం కోసం పోరాడింది. దీనివల్లే యూరోపియన్ యూని యన్ సంధానకర్త ఒకే ఒక్క దేశం (భారత్) దీనికి తన సమ్మతిని నిలిపి వేసినట్లు చెప్పారు. ఇది నిజమే అయినప్పటికీ, భారత్ తన మత్స్య కారుల జీవనోపాధి కోసం మంజూరు చేస్తున్న సబ్సిడీలను యూరో పియన్ యూనియన్, జపాన్, చైనా, తైవాన్ లు ఇస్తున్న భారీ సబ్సి డీలతో సమానం చేయడం అసంబద్ధం. భారత్ 25 ఏళ్ల సమ యాన్ని కోరింది. ఇది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మన లాంటి సమాఖ్య నిర్మాణంలో, మనం నెమ్మదిగా మాత్రమే త్వర పడగలము! ఎన్నికల సంవత్సరం కూడా అయినందువల్ల మత్స్య కారుల ప్రయో జనాలను గట్టిగా కాపాడటం తప్ప, ఇంకేదీ ప్రభుత్వం చేయలేక పోయింది.
మన రైతులకు కూడా ఇదే వర్తిస్తుంది. పబ్లిక్ స్టాక్‌హోల్డింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని భారత్ లాంటి దేశాలకు ప్రకటించిన నిబద్ధతను ప్రపంచ వాణిజ్య సంస్థ నిలుపు కోలేదు. సమస్యంతా మార్కెట్ ప్రాప్యతతో దీన్ని లింక్ చేయాలని పట్టుబట్టిన అభివృద్ధి చెందిన దేశాలతోనూ, కెయిర్న్స్ గ్రూప్ తోనూ (19 వ్యవసాయ సంబంధ ఎగుమతి దేశాల గ్రూప్) ఉంది. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అనేది తీవ్రమైన పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించే స్థిరమైన అభివృద్ధి లక్ష్యంతో ముడిపడిన ఒక తీవ్రమైన అంశం. దీనిని మార్కెట్ యాక్సెస్‌కు తాకట్టు పెట్టడం అన్యాయం, అధర్మం కూడా. అంతిమ పరిణామం ఏమిటంటే, ఎంసీ 13 ఈ సమస్యపై పురోగతి సాధించడంలో విఫలమైంది.
అప్పిలేట్ బాడీ పునరుద్ధరణ గురించిన కథ సైతం భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక్క సభ్యదేశం, అంటే అమెరికా మాత్రమే దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక, దానిమీదే భీష్మించుకుని కూర్చుంది. అమెరికన్ ఎన్నికల వల్ల దీనికి అదనపు అనిశ్చితి కూడా తోడైంది. డోనాల్డ్ ట్రంప్ గనక విజయం సాధిస్తే, అన్నీ ముగిసిపోతాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అప్పీలేట్ బాడీ పునరుద్ధరణను అడ్డుకోవడమే కాకుండా ఏకంగా డబ్ల్యూటీఓ నుండే మొత్తంగా వైదొలిగినా ఆశ్చర్యం లేదు. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఈ ఎంసీ 13 సమావేశం, ఎలక్ట్రానిక్ ప్రసారాలకు సంబంధించిన కస్టమ్స్ డ్యూటీ నిలుపుదలను కేవలం రెండేళ్లపాటు పొడిగించగలిగింది. అలా జరగకుండా అడ్డుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్... యూఏఈ వాణిజ్య మంత్రి నుంచి వచ్చిన వ్యక్తిగత అభ్యర్థన మేరకు చివరి నిమిషంలో అంగీకరించినట్లు భారత వాణిజ్య మంత్రి ద్వారా స్పష్టం చేసింది.ఎంసీ 13 ఎదుర్కొన్న ఇతర ప్రధాన సమస్య ఏమిటంటే, బహుపాక్షిక చర్చల కార్యక్రమాలతో ఎలా వ్యవహరించాలి అనేదే. ఒక విషయం చాలా ముఖ్యమైనది: అదేమిటంటే, 100 దేశాల మద్దతుతో జరిగిన చైనా నేతృత్వంలోని పెట్టుబడి సులభ తర అభివృద్ధి ఒప్పందం. కానీ ప్రతి డబ్ల్యూటీవో సభ్యదేశ ఏకాభిప్రాయాన్ని పొందనందున, దీన్ని సూత్రప్రాయంగా భారత్, దక్షిణాఫ్రికా వ్యతిరేకించాయి. చైనా ఈ పరిణామాన్నిఊహించి ఉండాల్సింది. దీంతో బహుపాక్షిక వేదికలలో చైనా–భారత సన్నిహిత సహకార యుగం ముగింపు దశకు చేరుకుందని నిర్ధారించవచ్చు.
‘బ్రిక్స్’ సమూహానికి ఇది ఎలాంటి చిక్కులను కలిగిస్తుందో చూడాలి.కాబట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఎంసీ 13లో వచ్చిన ఫలితాలు స్వల్పం. కొన్ని తాత్కాలిక నిర్ధారణలుగా వీటిని తీసుకోవచ్చు: ఒకటి, ప్రపంచ వాణిజ్య సంస్థకు నిజమైన బహుపాక్షిక(మల్టీలేటెరల్) సంస్థగా ఉజ్వల భవిష్యత్తు లేదు. కాబట్టి, అది బహుముఖంగా(ప్లూరీలేటెరల్) మారుతుందా? అలా అయితే, భారత్ దాన్ని ఎలా చూస్తుంది? రెండు, యథాతథ స్థితిని సూచించే అప్పీలేట్ బాడీ పునరుద్ధరణకు అమెరికా అంగీకరించే అవకాశం కని పించడం లేదు. బదులుగా మనం కేవలం ఒకే–దశ ప్యానెల్ విధానంతో సాగిన ‘గాట్’ (పన్నులు, సుంకాలపై సాధారణ ఒప్పందం) తరహా పాత చెడ్డ రోజులకు తిరిగి మరలవచ్చు.
అదే జరిగితే, భారత్ దానిని ఎలా ఎదుర్కొంటుంది? చివరగా, ప్రపంచ వాణిజ్య సంస్థను పునరుజ్జీవింపజేసే స్వల్ప అవకాశాలను దృష్టిలో ఉంచుకుని,ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్, గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)తో తన కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విష యంలో భారత్ త్వరపడాలి. ఈ విషయంలో సమయాన్ని వృథా చేసే ప్రసక్తే లేదు, మే నెలలో వచ్చే కొత్త ప్రభుత్వం దీన్నొక ప్రాధాన్యతగా దృష్టి సారించాల్సి ఉంది.భారత వ్యూహాత్మక/విదేశీ విధాన చర్చలకూ, దాని వాణిజ్య విధాన చర్చలకూ మధ్య కొంత వ్యత్యాసం కూడా ఉంది. మనం అనతి కాలంలోనే ఏడు లేదా పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాం అనే ఊహపై మన వ్యూహాత్మక చర్చలు ఆధారపడి ఉన్నాయి.
అయితే ప్రస్తుత వాణిజ్య విధాన ప్రక్రియ కేవలం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకే సరిపోతుంది! ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది. మే నెలలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం వ్యవసాయం, భూమి, కార్మికులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో లోతైన, నిర్మాణాత్మకమైన సంస్కరణలను చేపట్టడం దీనికి ఒక మార్గం. ఇది భారత్‌ను పెద్ద ఆర్థిక కూటమిలోకి చేరేలా సాయపడుతుంది.
- వ్యాసకర్త మాజీ రాయబారి, డబ్ల్యూటీవోలో భారత అనుసంధానకర్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
- మోహన్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment